Corona: 21రోజులు క్వారంటైన్‌లో ఓపిక పట్టలేక.. 5ఏళ్లు జైలుకు

కరోనా సోకిన వ్యక్తులు క్వారంటైన్‌లో ఉండటం తప్పనిసరి. కానీ కొందరు ఈ నిబంధనలకు గాలికొదిలి ఇష్టారీతిన బయట తిరుగుతున్నారు. వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారు.

Published : 07 Sep 2021 14:22 IST

వియత్నాం: కరోనా సోకిన వ్యక్తులు క్వారంటైన్‌లో ఉండటం తప్పనిసరి. కానీ కొందరు ఈ నిబంధనను గాలికొదిలి ఇష్టారీతిన బయట తిరుగుతున్నారు. వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్నారు. అలా వియత్నాంలోనూ ఓ వ్యక్తి కొవిడ్‌ క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో అతడి నుంచి మరికొందరికి వైరస్‌ సోకింది. దీంతో అతడికి 5ఏళ్ల జైలుశిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం.

కా మవూ ప్రాంతానికి చెందిన 28ఏళ్ల లి వాన్‌ ట్రీ ఇటీవల హో చిన్‌ మిన్‌ నగరానికి వెళ్లాడు. అక్కడ అతడు కరోనా బారిన పడ్డారు. ఆ దేశ నిబంధనల ప్రకారం.. వైరస్‌ సోకిన వారు తప్పనిసరిగా 21 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. అయితే లి వాన్‌ ఆ నియమాలను ఉల్లంఘించి తిరిగి తన సొంత నగరమైన కా మవూకు వెళ్లాడు. ఇది కాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. సోమవారం పీపుల్స్‌ కోర్టులో ప్రవేశపెట్టగా.. లి వాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. లి వాన్‌ నిబంధనలు ఉల్లంఘించి ప్రాణాంతకమైన వైరస్‌ వ్యాప్తికి కారణమవడంతో అతడికి శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది. అతడి నుంచి మరో 8 మందికి వైరస్‌ సోకిందని, అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారని వియత్నాం న్యూస్‌ ఎజెన్సీ తన కథనంలో వెల్లడించింది. కాగా.. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ వియత్నాంలో గతంలోనూ ఇద్దరు వ్యక్తులకు 18 నెలలు, రెండేళ్ల జైలు శిక్ష పడింది.

గతేడాది కరోనా తొలి దశ సమయంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో వియత్నాం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. మాస్‌ టెస్టింగ్‌లు, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌లు చేయడంలోనూ, సరిహద్దుల వద్ద కఠిన క్వారంటైన్ నిబంధనలు అమలు చేయడంలో ముందుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్కడ మళ్లీ కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా హో చిన్ మిన్‌ నగరంలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉంది.

వియత్నాంలో ఇప్పటివరకు 5,36,000 మందికి కరోనా సోకగా.. 13,385 మంది మరణించారు. ఇందులో అధిక సంఖ్యలో కేసులు, మరణాలు కేవలం గత రెండు, మూడు నెలల్లో చోటుచేసుకున్నవి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే వియత్నాం మరోసారి కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని