Published : 01 Jun 2021 01:39 IST

Hanoi: ఆ నగరం మొత్తానికి కొవిడ్‌ పరీక్షలు

ఇంటర్నెట్‌డెస్క్‌: వియత్నాం ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద పట్టణమైన హనోయ్‌లో ప్రజలందరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ దేశంలో సరికొత్త వేరియంట్‌ వెలుగు చూడటంతో  వియత్నాం అప్రమత్తమైంది. కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇక హుచిమిన్‌ నగరంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రకటించింది. 10 మందికి మించి గుమిగూడటాన్ని రెండు వారాలపాటు నిషేధించింది. వియత్నాంలో గత గురువారం నుంచి చాలా వరకూ వ్యాపారాలను మూసివేశారు. స్థానిక చర్చిలో వైరస్‌ వ్యాపించేలా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఒక జంటపై కేసు నమోదు చేశారు. దాదాపు 145 కేసులకు చర్చితో సంబంధాలు ఉండటంతో లాక్‌డౌన్‌ చేశారు. వియత్నాంలో మత సంబంధమైన అన్ని రకాల కార్యక్రమాలపై నిషేధం ఉంది. 

హనోయ్‌ నగర పాలక అధికారులు రోజు లక్ష నమూనాలు చొప్పున ప్రజలందరికీ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ‘వియత్నమ్‌ న్యూస్‌’ సంస్థ పేర్కొంది. వియత్నాంలో ఏప్రిల్‌ నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక్కడ మొత్తం 31 మున్సిపాలిటీలు, ప్రావిన్స్‌లో కలిపి 4,000 పైగా కేసులు నమోదు అయ్యాయి. కరోనా వ్యాప్తి మొదటి దశలో నమోదైన కేసులతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు ఉంది. 

భారత్‌, బ్రిటన్‌లలో కనిపించిన కరోనా వైరస్‌ సంకర రకం వియత్నాంను హడలెత్తిస్తోంది. సగానికి పైగా భూభాగంలో సంకర రకం వైరస్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇది గాలిలో క్షణాల్లో వ్యాపిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి న్యుయెన్‌ థాన్‌ లాంగ్‌ శనివారం చెప్పారు. వియత్నాంలో తొలి విడతలోనే ఏడు రకాలైన కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినా ఉద్ధృతికి చాలావరకూ కళ్లెం వేసి ప్రశంసలు పొందింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిర్దిష్టంగా వీటి సంఖ్య ఎంత అనేది ప్రభుత్వం వెల్లడించలేదు. భారత్‌, బ్రిటన్‌లలో కనిపిస్తున్న రకాల హైబ్రిడ్‌ వేరియంట్‌ ప్రస్తుతం ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్‌కు కళ్లెం వేయడంలో భాగంగా లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు విధించారు.

కరోనా వైరస్‌ శరీరంలో పునరుత్పత్తి అవుతున్న సమయంలో జరిగే స్వల్ప జన్యుమార్పుల కారణంగా కొత్త రకాలు పుట్టుకొస్తాయి. ఇవన్నీ 2019లో చైనాలో కనిపించిన వైరస్‌ను పోలి ఉన్నా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిని నాలుగు ఆందోళనకర వేరియంట్లుగా గుర్తించింది. వియత్నాం ఇప్పటి వరకు 10లక్షల మందికి ఆస్ట్రాజెనికా టీకాలను వేసింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఫైజర్‌ నుంచి మరో 30 లక్షల టీకాలు రానున్నాయి. మిగిలిన వారికి టీకాల కోసం మోడెర్నాతో ఇప్పటికే చర్చలు జరుపుతోంది. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని