Vijay Mallya: అప్పు చెల్లించకుండా.. విదేశాల్లో మాల్యా ఆస్తులు కొనుగోలు: సీబీఐ

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు అవసరమైన మొత్తం తన వద్ద ఉన్నప్పటికీ, రుణం తిరిగి చెల్లించకుండా.. విజయ్‌ మాల్యా (Vijay Mallya) వ్యక్తిగత ఆస్తులు కొనుగోలు చేశారని సీబీఐ తాజా ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. 

Updated : 23 Mar 2023 18:15 IST

ముంబయి: భారతీయ బ్యాంకుల (Indian Banks) నుంచి రూ. వేల కోట్ల రుణాలు తీసుకొని విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా (Vijay Mallya) ఉద్దేశపూర్వకంగానే ఎగవేతకు పాల్పడినట్లు సీబీఐ (CBI) ఆరోపించింది. ఈ మేరకు ముంబయి కోర్టులో తాజాగా విదేశాల్లో మాల్యా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలతో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది.  2015-16 మధ్య కాలంలో మాల్యా ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌లలో రూ. 330 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఆ సమయంలో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొనసాగుతున్నప్పటికీ, మాల్యా విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశారని తెలిపింది. 

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్ (Kingfisher Airlines) కోసం మాల్యా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు అవసరమైన మొత్తం 2008, 2017లో ఆయన వద్ద ఉందని సీబీఐ పేర్కొంది. కానీ, ఆయన రుణం తిరిగి చెల్లించకుండా, వ్యక్తిగత ఆస్తులు కొనుగోలు చేయడంతోపాటు, కొంత మొత్తం నగదును స్విట్జర్లాండ్‌లోని తన పిల్లల ఖాతాల్లోకి బదిలీ చేశారని ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. కోర్టు అనుమతితో వివిధ దేశాల్లో విజయ్‌ మాల్యాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను సీబీఐ సేకరించింది. వాటి ఆధారంగా ముంబయి కోర్టులో తాజాగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఫ్రాన్స్‌లో సుమారు 35 మిలియన్‌ యూరోల విలువైన ఆస్తిని కొనుగోలు చేసిన మాల్యా, దానికి 8 మిలియన్‌  యూరోలను  తన బంధువులకు చెందిన జిజ్‌మో హోల్డింగ్స్‌ ద్వారా చెల్లించినట్లు సీబీఐ పేర్కొంది. 

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌  కోసం ఐడీబీఐ బ్యాంకు నుంచి రుణం తీసుకుని మోసం చేసిన కేసులో విజయ్‌ మాల్యాతో పాటు బ్యాంకు మాజీ జనరల్‌ మేనేజర్‌ బుద్ధదేవ్‌ దాస్‌గుప్తాను పేరును కూడా సీబీఐ తాజా ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. విదేశాల్లోని వివిధ సంస్థల నుంచి సేకరించిన ఆధారాల ప్రకారం 2008-2012 మధ్య కాలంలో ఫోర్స్‌ ఇండియా ఫార్మాలా వన్‌ బృందానికి మాల్యా అధిక మొత్తంలో చెల్లింపులు చేశారని తెలిపింది. రూ.9వేల కోట్ల రుణ ఎగవేత ఆరోపణలతో దేశం విడిచి వెళ్లిపోయిన మాల్యా.. 2016 నుంచి యూకేలో ఉంటున్నారు. ఆయనను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అయితే, పలు కారణాలు చెబుతోన్న విజయ్‌ మాల్యా.. అక్కడే తలదాచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని