Sidhartha Mallya: లేడీవాక్‌ ఎస్టేట్‌లో ఘనంగా సిద్ధార్థ్‌ మాల్యా వివాహం

విజయ్‌ మాల్యా కుమారుడు సిద్ధార్థ్‌ వివాహం శనివారం లండన్‌ సమీపంలోని ఓ విలాసవంతమైన ఎస్టేట్‌లో జరిగింది.  

Published : 23 Jun 2024 13:45 IST

ఇంటర్నెట్‌డెస్క్: పరారీలో ఉన్న లిక్కర్‌ టైకూన్‌ విజయ్‌మాల్యా (Vijay Mallya) కుమారుడు సిద్ధార్థ్‌ మాల్యా వివాహం శనివారం లండన్‌ సమీపంలోని ఓ విలాసవంతమైన ఎస్టేట్‌లో జరిగింది. తన స్నేహితురాలు జాస్మిన్‌తో ఉంగరాలు మార్చుకొని జూనియర్‌ మాల్యా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో వెల్లడించారు. వారిద్దరి కామన్‌ ఫ్రెండ్‌ కూడా వెడ్డింగ్‌ చిత్రాన్ని పోస్టు చేశారు. సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. అమెరికా నటి ఇమ్మె హార్ట్‌ కూడా అతిథుల్లో ఉన్నారు. ఆమె వధూవరులకు మిత్రురాలు.

వివాహం విషయాన్ని ఇటీవలే సిద్ధార్థ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అతడు 2023లో జరిగిన హాలోవిన్‌ సంబరాల్లో జాస్మిన్‌కు ప్రపోజ్‌ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన చిత్రాలు జూనియర్‌ మాల్యా ఇన్‌స్టాలో ఉన్నాయి.  వీటిలో జాస్మిన్‌ మాంత్రికురాలి డ్రెస్‌లో ఉండగా.. సిద్ధార్థ్‌ హాలోవిన్‌ పంప్‌కిన్‌ డ్రెస్‌ ధరించాడు.

14 మిలియన్‌ డాలర్ల ఎస్టేట్‌..

లండన్‌ సమీపంలో హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో ఉన్న లేడీవాక్‌ ఎస్టేట్‌లో సిద్ధార్థ్‌-జాస్మిన్‌ వివాహం జరిగింది. ఈ ఎస్టేట్‌ను విజయ్‌ మాల్యా 2015లో కొనుగోలు చేశారు. అప్పట్లో దీనికి ఆయన 14 మిలియన్‌ డాలర్లు చెల్లించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ ఎస్టేట్‌ ఎఫ్‌-1 రేసింగ్‌ ఛాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ తండ్రి ఆంటోనీ పేరిట ఉండేది. మాల్యా కొనుగోలు చేసిన తర్వాత దీనిలో రెండేళ్లపాటు మార్పులు చేశారు. దాదాపు ఇది 30 ఎకరాల్లో విస్తరించి ఉంది. మూడు ప్రధాన భవనాలు.. పలు ఔట్‌ హౌసులు, స్విమ్మింగ్‌ పూల్స్‌, టెన్నిస్‌ కోర్టులు ఉన్నాయి. ఇక్కడున్న గ్యారేజీలో మాల్యాకు చెందిన విలాసవంతమైన కార్లు కొలువుదీరి ఉన్నాయి. ఆయన కొనుగోలు చేసిన తర్వాత చాలా మంది కళాకారులు, నిర్మాణ రంగ నిపుణులు ఆ భవనాన్ని సందర్శించి మార్పులు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని