Vaccination: అపోహలు వద్దు.. టీకానే ముద్దు

కరోనా వైరస్‌కు కళ్లెం వేయటమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకా పంపిణీ కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహిస్తున్నాయి. కరోనా కోరల నుంచి తప్పించుకునేందుకు టీకానే ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇప్పటికీ చాలా మందిలో టీకాపై అపోహలు బలంగా

Published : 22 Jun 2021 23:14 IST

పల్లెబాటపట్టిన యూపీ ఆరోగ్య సిబ్బంది

 

లఖ్‌నవూ: కరోనా వైరస్‌కు కళ్లెం వేయటమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకా పంపిణీ కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహిస్తున్నాయి. కరోనా కోరల నుంచి తప్పించుకునేందుకు టీకానే ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇప్పటికీ చాలా మందిలో టీకాపై అపోహలు బలంగా  నాటుకుపోయాయి. ప్రారంభంలో దేశ వ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపించినా.. పట్టణ ప్రాంత వాసులు టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కానీ మారుమూల ప్రాంతాల్లో మాత్రం ఆ పరిస్థితి ఇంకా కనిపించటం లేదు. ఈ నేపథ్యంలోని ఉత్తరప్రదేశ్ ఆరోగ్య సిబ్బంది పల్లెబాట పట్టింది. పల్లెవాసుల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించి టీకా వైపు మెుగ్గుచూపేలా వారిలో అవగాహన కల్పిస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో కరోనా సహా కొవిడ్‌ టీకాలపై అపోహలు రాజ్యమేలుతున్నాయి. ప్రధానంగా జామ్‌సోటి, సికిందర్‌పుర్‌ గ్రామ ప్రజలు కరోనాపై కనీస అవగాహన లేకుండా జీవిస్తున్నారు. కరోనా కేవలం పట్టణాల్లో మాత్రమే ఉందని, తమ గ్రామం వైరస్‌ నుంచి పూర్తిగా సురక్షితమని అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు టీకాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలు వారిని వ్యాక్సినేషన్‌కు దూరం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్థులకు వైరస్‌ పట్ల అవగాహన కల్పించడంతోపాటు టీకాలు వేసుకునేలా అక్కడి ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి కొవిడ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. టీకా వేసుకోవాల్సిన అత్యవసర పరిస్థితుల్ని పల్లెవాసులకు వివరిస్తున్నారు.

కరోనా రెండో దశ ఉద్ధృతితో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్‌, మే నెలల్లోనే సుమారు లక్షా 80 వేల మంది కొవిడ్‌కు బలైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. థర్డ్‌ వేవ్‌ సైతం దేశంపై విరుచుకుపడే అవకాశం ఉందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని మెజారిటీ ప్రజలు ఇంకా టీకాలకు దూరంగా ఉండటం ఆందోళనను మరింత పెంచుతోంది. వ్యాక్సిన్లపై సామాజిక మాధ్యమాలు సహా ఇతర వేదికలపై జరుగుతున్న అసత్య ప్రచారాలు టీకా కార్యక్రమాన్ని బలహీనం చేస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్‌ వేసుకుంటే రుతుక్రమం దెబ్బతింటుందని, సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందన్న భయాలు చాలా మంది మహిళల్లో ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూపీ ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, రేడియో ప్రచారాలు ప్రజల్లో నెలకొన్ని ఆందోళన, అపోహలు తగ్గిస్తాయని అధికారులు భావిస్తున్నారు.

టీకాలకు ప్రజల్ని దూరం చేస్తున్న అసత్య ప్రచారాలపై కేంద్రం సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వ్యాక్సిన్‌పై వదంతుల వల్ల సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకి తీవ్ర హాని కలుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. టీకాపై దుష్ప్రచారాలను తరిమికొడుతూ ప్రతిఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని పిలుపునిచ్చింది. దేశంలో కరోనా వ్యాక్సిన్‌ మెగా డ్రైవ్‌ ప్రారంభమైన సందర్భంగా వ్యాక్సిన్లపై కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే చెడు ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అర్హులైన ప్రతిఒక్కరు టీకాలు వేసుకోవడం ద్వారా కొవిడ్‌ ముప్పును అడ్డుకోవచ్చని పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని