PM Modi: గాంధీజీ ‘గ్రామ స్వరాజ్‌’ కలను సాకారం చేద్దాం: మోదీ పిలుపు

భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన వారి కలల్ని సాకారం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గ్రామ స్వరాజ్‌ ....

Published : 12 Mar 2022 01:37 IST

అహ్మదాబాద్‌: భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన వారి కలల్ని సాకారం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గ్రామ స్వరాజ్‌ కలను సాకారం చేయడంలో పంచాయతీ రాజ్‌ వ్యవస్థ ఎంతో కీలకమన్నారు. మహాత్మా గాంధీ ఎప్పుడూ గ్రామీణాభివృద్ధి, గ్రామాల స్వావలంబన గురించే ఎక్కువగా మాట్లాడేవారన్నారు. శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించిన ప్రధాని.. నిన్న వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో నాలుగు రాష్ట్రాల్లో భాజపా విజయదుందుభి మోగించడంతో భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం సాయంత్రం జీఎండీసీ మైదానంలో నిర్వహించిన పంచాయత్‌ మహాసమ్మేళన్‌ కార్యక్రమంలో లక్ష మందికి పైగా పంచాయతీరాజ్‌ ప్రతినిధులతో మాట్లాడారు. పిల్లల్లో విద్యను ప్రోత్సహించేలా గ్రామాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రాథమిక పాఠశాలల్లో వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు.

అలాగే, స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో 75 మొక్కలను నాటాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. గుజరాత్‌ పంచాయతీ రాజ్‌ వ్యవస్థలో పురుషుల కన్నా మహిళలే అధిక శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. ‘‘మహాత్మా గాంధీ, సర్దార్‌ పటేల్‌ పుట్టిన నేల గుజరాత్‌. బాపూ ఎప్పుడూ గ్రామీణాభివృద్ధి, గ్రామాల స్వయం సమృద్ధి గురించి మాట్లాడేవారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవం జరుపుకొంటున్న ఈ తరుణంలో గాంధీజీ కలలుగన్న గ్రామ వికాస్‌ను సాకారం చేసుకోవాలి. పంచాయతీ సభ్యులతో పాటు సర్పంచులంతా ఈ లక్ష్యసాధనకు కృషిచేయాలి’’ అని మోదీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని