Covid: ఆ గ్రామాల్లో రోజుకొకరు చొప్పున బలి

రెండో దశలో కొవిడ్‌ మహమ్మారి పల్లెలపై పెను ప్రతాపమే చూపిస్తోంది. అవగాహన లోపం, సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో మారుమూల పల్లెల్లో కరోనా విజృంభిస్తోంది.

Updated : 22 May 2021 12:26 IST

రాంచీ: రెండో దశలో కొవిడ్‌ మహమ్మారి పల్లెలపై పెను ప్రతాపమే చూపిస్తోంది. అవగాహన లోపం, సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో మారుమూల పల్లెల్లో కరోనా విజృంభిస్తోంది. వైరస్‌ గురించి తెలుసుకునేలోపే అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఝార్ఖండ్‌లోని ఓ గ్రామంలో కేవలం 20 రోజుల వ్యవధిలోనే 22 మంది కొవిడ్‌ లక్షణాలతో మరణించగా, ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామంలోనూ అనేక మంది వైరస్‌కు బలయ్యారు.   

ఝార్ఖండ్‌లోని పాలము జిల్లాలో మారమూల సువా కౌడియా గ్రామంలో గడిచిన 20 రోజుల్లో 22 మంది చనిపోయారు. ఏప్రిల్‌ 25 నుంచి మే 15 మధ్య ఈ మరణాలు సంభవించాయి. వీరంతా కొవిడ్‌ లక్షణాలతో చనిపోయినట్లు గ్రామస్థులు చెబుతుండగా.. అధికారులు మాత్రం ఇంకా ధ్రువీకరించలేదు. ఈ గ్రామంలో ఇప్పటివరకు ఎలాంటి కరోనా పరీక్షలు చేయలేదు. చనిపోయినవారంతా ఎలాంటి చికిత్స తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.  ఘటనపై జిల్లా డిప్యూటీ కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. మరోవైపు హజరీబాగ్ జిల్లాలోని ఖుత్రా గ్రామంలో ఇటీవల 10 రోజుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

వలస కూలీలతో వైరస్‌ విజృంభణ

ఉత్తరప్రదేశ్‌లోని గోండా ప్రాంతంలో గల నిందురా గ్రామంలో ఇప్పటివరకు 22 మంది కొవిడ్‌ లక్షణాలతో మరణించారు. మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ ఆంక్షలతో ముంబయి నుంచి అనేక మంది వలస కూలీలు సొంత ప్రాంతాలకు తిరిగొచ్చారు. వీరంతా గ్రామాల్లో కలివిడిగా తిరగడమేగాక, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఎన్నికల తర్వాత నుంచి నిందురా గ్రామంలో రోజుకొకరు చొప్పున చనిపోతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వలస కూలీలతోనే వైరస్‌ వ్యాపించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ గ్రామానికి కనీస సౌకర్యాలు లేవు. ఆసుపత్రికి వెళ్లేందుకు కనీసం అంబులెన్స్‌ కూడా దొరకదని గ్రామస్థులు వాపోతున్నారు.

ఇటీవల రాజస్థాన్‌లోని ఒక గ్రామంలో వైరస్‌ ఉద్ధృతికి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇవే కాదు.. దేశవ్యాప్తంగా చాలా మారుమూల పల్లెల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇక్కడి కేసులు, మరణాలు అధికారిక లెక్కల్లో ఉంటాయో లేదో కూడా స్పష్టత లేదు. మరోవైపు దేశంలో దాదాపు 80శాతం గ్రామాలకు వైద్య సౌకర్యాలు లేవని మిషన్‌ అంత్యోదయ సర్వే కూడా చెప్పడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని