UP: యూపీలో రైతుల ఆందోళన హింసాత్మకం.. 8 మంది మృతి!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లకింపూర్‌ ఖేరీ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై మంత్రుల కాన్వాయ్‌ దూసుకెళ్లింది.

Updated : 24 Sep 2022 16:29 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై కేంద్రమంత్రి కాన్వాయ్‌ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

ఘటనపై కేంద్ర మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రా స్పందిస్తూ.. ‘‘రైతుల రాళ్ల దాడితో కారు బోల్తా పడింది. కారు కింద పడి ఇద్దరు చనిపోయారు. ప్రమాదం తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడి జరిగిన తర్వాత మా కార్లకు నిప్పు పెట్టారు. ముగ్గురు భాజపా కార్యకర్తలు, డ్రైవర్‌ను కొందరు కొట్టి చంపారు. ఘటనా స్థలంలో నా కుమారుడు లేడు’’ అని అన్నారు.

లఖీమ్‌పూర్‌ ఖేరీ జిల్లా టికునియాలో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఆదివారం హాజరయ్యారు. వీరి పర్యటనను నిరసిస్తూ ఉదయం నుంచి రైతులు నల్ల జెండాలు చూపిస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. అదే సమయంలో కేంద్రమంత్రి, డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు,  వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారని పోలీసులు తెలిపారు. కారుతో రైతులను ఢీకొట్టిన ఘటనలో కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రా పేరు వినిపిస్తోంది. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతం ఉద్రిక్తతంగా మారింది. ఆగ్రహంతో మూడు వాహనాలను రైతులు తగలబెట్టారు. రైతులపై కాన్వాయ్‌ దూసుకెళ్లడాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా నేత రాకేశ్‌ టికాయత్‌ ఖండించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని