Australia: లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. పోలీసులపై దాడి

లాక్‌డౌన్‌ ఎత్తివేయాలంటూ మెల్‌బోర్న్‌లో ప్రజలు రోడ్లెక్కారు. దాదాపు వేయి మంది రోడ్లపైకి చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.....

Published : 19 Sep 2021 01:34 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి పలు నగరాల్లో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. అయితే మెల్‌బోర్న్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేయాలంటూ ప్రజలు రోడ్లెక్కారు. దాదాపు వేయి మంది రోడ్లపైకి చేరి లాక్‌డౌన్‌ ఎత్తివేయాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వారిని అదుపుచేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పలువురిని అరెస్టు చేశారు.

మెల్‌బోర్న్‌లో విధించిన లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో కొవిడ్ ఆంక్షలను ఉల్లంఘిస్తూ.. సుమారు వెయ్యి మంది ప్రజలు రోడ్లపైకి చేరి ప్రదర్శన చేపట్టారు. వారిని అడ్డుకునేందుకు రెండువేల మంది పోలీసులు ప్రయత్నించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పెప్పర్‌ స్ప్రే ప్రయోగించారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అడ్డుకున్న పోలీసులపై దాడికి పాల్పడ్డారు. వారిపై రాళ్లు, సీసాలు రువ్వారు. ఈ ఘటనలో దాదాపు 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే 235 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొవిడ్ విజృంభిస్తుండటంతో మెల్‌బోర్న్‌లో ఆరోసారి లాక్‌డౌన్‌ విధించారు. గత నెల 6వ తేదీ నుంచి ఆరో లాక్‌డౌన్‌ కొనసాగుతోది. శనివారం కొత్తగా 535 కొవిడ్‌ కేసులు నమోదవగా, 19 మంది మృతిచెందారు. ఇదిలా ఉండగా.. లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా సిడ్నీలో కూడా ఆందోళనలు జరిగాయి. 32 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రిస్బేన్‌, పెర్త్‌లోనూ లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ప్రజలు ర్యాలీలు నిర్వహించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని