Agnipath Protests: 7 రాష్ట్రాల్లో అగ్నిపథ్‌ ఆందోళనలు.. బిహార్‌లో ఒకరు మృతి..!

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేగాయి. పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు రైళ్లకు నిప్పుపెట్టడంతో ఉద్రిక్త

Updated : 17 Jun 2022 18:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జ్వాలలు రేగాయి. పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు రైళ్లకు నిప్పుపెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మొత్తం 7 రాష్ట్రాలకు ఈ నిరసనలు పాకగా.. దాదాపు 200 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

బిహార్‌లో నేతల ఇళ్లపై దాడి..

అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ బిహార్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రహదారులు, రైల్వే ట్రాక్‌లపైకి చేరి నిరసన చేపట్టారు. బెగుసరై జిల్లా రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలుకు నిప్పుపెట్టారు. మరోవైపు, బెట్టాయ్‌లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రేణు దేవి, రాష్ట్ర భాజపా చీఫ్‌ సంజయ్‌ జైశ్వాల్‌ ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. ఈ ఘటనల్లో ఓ పోలీసు గాయపడ్డారు. లఖిసరై జిల్లాలోని రైల్వేస్టేషన్‌లో ఓ రైలుకు నిరసనకారులు నిప్పంటించారు. దీంతో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఈ కారణంగా ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురికాగా.. అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

యూపీలో ఉద్రిక్తత..

ఉత్తరప్రదేశ్‌లోనూ పలు జిల్లాల్లో రైల్వే స్టేషన్ల వద్ద నిరసనకారులు ఆందోళన చేపట్టారు. పలు రైళ్లకు నిప్పటించారు. అయితే ఆ సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అలీగఢ్‌లో యమునా ఎక్స్‌ప్రెస్‌వే వద్దకు పెద్దఎత్తున ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారు పోలీసు వాహనంపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ ప్రాంతంలో ఆందోళనకారులు హైవేపై బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో లాఠీఛార్జ్‌ చేశారు.

గురుగ్రామ్‌లో 144 సెక్షన్‌..

హరియాణాలో అగ్నిపథ్‌పై ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులు రహదారులను నిర్బంధించడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. గురుగ్రామ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో నగర వ్యాప్తంగా 144 సెక్షన్‌ విధించారు.

దిల్లీలో మెట్రోల వద్ద భద్రత

దిల్లీలో ఛాత్ర -యువ సంఘర్ష్‌ సమితి నేతృత్వంలోని విద్యార్థులు ఆందోళన చేపట్టగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనల దృష్ట్యా పలు మెట్రో స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.  పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి జిల్లాలో విద్యార్థులు రోడ్లపై టైర్లకు నిప్పంటించి ధర్నా చేపట్టారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా పలువురు గాయపడ్డారు.

200 రైళ్లకు అంతరాయం..

పలు రైల్వే స్టేషన్లలో ఆందోళనల నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 200లకు పైగా రైళ్లపై నిరసనల ప్రభావం పడింది. దక్షిణ మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేశాయి. మరికొన్నింటిని దారి మళ్లించాయి. తూర్పు మధ్య రైల్వే 59 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని