Satyendar Jain: ఈడీ కస్టడీలో ఉన్న మంత్రి ముఖంపై గాయం.. స్పందించిన కేజ్రీవాల్‌

మనీలాండరింగ్ కేసులో భాగంగా దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో వెలుగులోకి వచ్చిన మంత్రి ఫొటో ఒకటి పలు అనుమానాలకు తావిచ్చింది.

Published : 10 Jun 2022 16:51 IST

దిల్లీ: మనీలాండరింగ్ కేసులో భాగంగా దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో వెలుగులోకి వచ్చిన మంత్రి ఫొటో ఒకటి పలు అనుమానాలకు తావిచ్చింది. కారులో ఉన్న మంత్రి ముఖంపై రక్తం ఆనవాళ్లు కనిపించాయి. దాంతో ఆయన గాయపడ్డారనే ఊహాగానాలు వినిపించాయి. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో షేర్ కాగా.. ఆప్‌ నేతలతో సహా పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. 

‘ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన్ను నేరుగా సంప్రదించే అవకాశం లేకపోవడంతో నేను దీనిపై పెద్దగా మాట్లాడలేను. మంత్రిని నిన్న ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి మెరుగయ్యాక తిరిగి తీసుకెళ్లిపోయారు’ అని కేజ్రీవాల్ అన్నారు. మరికొందరు ఆయనకు మద్దుతుగా ట్వీట్లు చేశారు. ‘ఈ మనిషే దిల్లీకి మొహల్లా క్లినిక్‌లు ఇచ్చారు’ అని ఒకరు పోస్టు చేశారు. ‘దిల్లీకి మొహల్లా క్లినిక్‌లు ఇచ్చిన ఈ వ్యక్తి.. నిజాయతీతో పాలన చేశారు. భాజపా వాళ్లకు ఏదో ఒకరోజు దేవుడు తగిన గుణపాఠం చెప్తాడు’ అని ఆప్‌ నేత వికాస్‌ యోగి విమర్శించారు. ఈ దేశం మిమ్మల్ని క్షమించదంటూ మరికొందరు.. భాజపా, ఈడీపై మండిపడ్డారు. 

కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30వ తేదీన సత్యేంద్ర జైన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్‌ కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ.. ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఇటీవల ఆయన్ను అరెస్టు చేసింది. జైన్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా.. జూన్‌ 9 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. నిన్న దానిని జూన్ 13 వరకు పొడిగించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని