Virginity: కన్యత్వ పరీక్షలు అమానుషం: దిల్లీ హైకోర్టు

కన్యత్వ పరీక్షలపై న్యాయపరమైన విధానమేదీ లేదని దిల్లీ హైకోర్టు (Delhi HighCourt) స్పష్టం చేసింది. మహిళా నిందితులకు (Women accused) కన్యత్వ పరీక్షలు నిర్వహించడం అమానుషమని వ్యాఖ్యానించింది.

Published : 08 Feb 2023 00:56 IST

దిల్లీ: మహిళా నిందితులకు కన్యత్వ పరీక్షలు నిర్వహించడం అమానుషమని, రాజ్యాంగానికి విరుద్ధమని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది వాళ్ల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడమేనని పేర్కొంది. కన్యత్వ పరీక్షలపై న్యాయపరమైన విధానమేదీ లేదన్న ఉన్నత న్యాయస్థానం..ఇలా పరీక్షలు నిర్వహించడాన్ని అమానుష చర్యగా పరిగణించింది. ఈ మేరకు 1992లో క్రైస్తవ సన్యానిసిని (నన్‌) మృతి కేసుకు సంబంధించి సిస్టర్‌ సెఫీ దాఖలు చేసిన పిటిషన్‌పై  రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది.

‘‘దర్యాప్తులో భాగంగా మహిళలకు కన్యత్వ పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగానికి విరుద్ధం. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నా, పోలీస్‌ కస్టడీలో ఉన్నా కన్యత్వ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. కాదని చేస్తే, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21ని ఉల్లంఘించినట్లే’’ అని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కస్టోడియల్‌ డిగ్నిటీ అంశాన్ని ప్రస్తావిస్తూ.. మహిళలకు గౌరవంగా జీవించే హక్కు ఉందని, దానికి నష్టం వాటిల్లేలా ఎవరు ప్రవర్తించినా రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది.

‘‘విచిత్రం ఏంటంటే..‘కన్యత్వం’ అనే పదానికి కచ్చితమైన శాస్త్రీయ, వైద్యపరమైన నిర్వచనం లేకపోయినా, అది మహిళల స్వచ్ఛతకు చిహ్నంగా మారింది. సుప్రీం కోర్టు కూడా అనేక తీర్పుల్లో కన్యత్వ పరీక్షలకు శాస్త్రీయత లేదని చెప్పింది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 1992లో నన్‌ మృతి కేసుతో తనకు సంబంధం లేదని చెబుతున్నా సీబీఐ తనకు 2008లో బలవంతంగా కన్యత్వ పరీక్షలు నిర్వహించినట్టు సెఫీ అనే మరో నన్‌ కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన వివరాలు కూడా లీక్‌ అయ్యాయని తెలిపారు. దీనిపై తాజాగా ధర్మాసనం తీర్పు వెలువరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని