Updated : 13 Nov 2020 13:01 IST

ఈ వర్చువల్‌ ఫుడ్‌ఫెస్టివల్‌.. వేరే లెవెల్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏటా జరిగే ఫుడ్‌ఫెస్టివల్‌, గేమింగ్‌, మ్యూజికల్‌ కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనేవారు. కానీ, ఈ ఏడాది కరోనా కారణంగా వాటి ఊసే లేకుండాపోయింది. నలుగురు కలిసే చోటుకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. దీంతో పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొనే కార్యక్రమాలన్నీ రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో మలేషియాలో మద్యం తయారు చేసే ‘టైగర్‌’ సంస్థ ఏటా నిర్వహించే ఫుడ్‌ఫెస్టివల్‌ కూడా రద్దయింది. అయితే, ఆహార ప్రియుల్ని నిరాశపర్చడం ఇష్టంలేక ఒక వినూత్న ప్రయత్నం చేసింది. వర్చువల్‌గా ఫుడ్‌ఫెస్టివల్‌ ప్రారంభించింది. దీంతో ప్రజలు స్వయంగా వెళ్లలేకపోయినా.. వర్చువల్‌గా ఫుడ్‌ఫెస్టివల్‌లో పాల్గొనొచ్చు.

ఈ ఫుడ్‌ఫెస్టివల్‌ కోసం టైగర్‌ సంస్థ.. ‘టైగర్‌స్ట్రీట్‌ఫుడ్‌.ఎంవై’ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇదొక వర్చువల్‌ 3డీ ప్రపంచం. ఇందులో కౌలాలంపుర్‌, సెలంగోర్‌, పెనంగ్‌ ప్రాంతాల్లో ఫుడ్‌ఫెస్టివల్‌ జరిగే వీధుల్ని డెస్క్‌టాప్‌/మొబైల్‌ తెరపైనే చూపిస్తారు. మొత్తం 88 ఫుడ్‌కోర్టులుంటాయి. ఈ ఫుడ్‌ఫెస్టివల్‌లో పాల్గొనేవాళ్లు మొదట వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పబ్‌జీ గేమ్‌ తరహాలోనే యూజర్‌ తన పేరుతో ఒక వర్చువల్‌ క్యారెక్టర్‌ను రూపొందించుకోవాలి. ఫుడ్‌ఫెస్టివల్‌ జరిగే ఏ ప్రాంతానికి వెళ్లాలో ఎంపిక చేసుకుంటే.. ఆ ప్రాంతానికి యూజర్‌ను వాహనంలో తీసుకెళ్లి వదిలేస్తారు.

అక్కడి నుంచి యూజర్‌ వీధుల్లో తిరుగుతూ ఫుడ్‌ఫెస్టివల్‌ను ఆస్వాదించొచ్చు. కేవలం ఫుడ్‌కోర్టులే కాదు, గేమింగ్‌ సెంటర్లు కూడా ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌లో ఎంతమంది యూజర్లు లాగ్‌ఇన్‌ అయి యాక్టివ్‌గా ఉన్నారో.. వారంతా తెరపై కనిపిస్తుంటారు. వారితో ముచ్చటించొచ్చు.. స్నేహితులుగా మారొచ్చు. మలేషియాకి చెందిన ప్రముఖ గాయకుడి మ్యూజికల్‌ కార్యక్రమం వర్చువల్‌గానే నిర్వహిస్తారట. యూజర్లు ఇంట్లో కూర్చొనే ఈ కార్యక్రమంలో పాల్గొనచ్చు. ఈ వర్చువల్‌ ఫెస్టివల్‌లోనూ కొవిడ్‌ నిబంధనలు పాటించడం విశేషం. 

మరి ఆహారం ఎలా తినాలి??

వర్చువల్‌గా వీధుల్లో ఫుడ్‌కోర్టులు కనిపిస్తుంటాయి. యూజర్‌ నచ్చిన ఫుడ్‌కోర్టుకు వెళ్లి.. దానిపై క్లిక్‌ చేస్తే ఒక పాప్‌అప్‌ వస్తుంది. అక్కడి ఫుడ్‌కోర్టులో లభించే ఆహార పదార్థాలన్నీ అందులో దర్శనమిస్తాయి. కావాల్సిన వాటిని ఆర్డర్‌ చేస్తే కొన్ని నిమిషాల్లో ఇంటికి డోర్‌ డెలివరీ చేస్తారు. ఇందుకోసం ‘టైగర్‌’ సంస్థ ఫుడ్‌ డెలివరీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. గతవారాంతం ప్రారంభమైన ఈ ఆన్‌లైన్‌ ఫుడ్‌ఫెస్టివల్‌ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. కేవలం శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం 11గంటల నుంచి రాత్రి 9గంటల వరకే ఈ ఫుడ్‌కోర్టులు తెరిచి ఉంటాయి. భలే ఆలోచన కదా..!

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని