Covid: విదేశీయులకు వీసా గడువు పెంపు

కొవిడ్‌ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయులకు వీసా గడువు పెంచింది కేంద్రం. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆగస్టు 31 వరకు వారి వీసా గడువును పెంచుతున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది

Updated : 15 Oct 2022 16:50 IST

దిల్లీ: కొవిడ్‌ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయులకు వీసా గడువు పెంచింది కేంద్రం. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆగస్టు 31 వరకు వారి వీసా గడువును పెంచుతున్నట్లు కేంద్ర హోంశాఖ నేడు ఓ ప్రకటనలో వెల్లడించింది.  

కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చి నుంచి సాధారణ కమర్షియల్‌ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. కేవలం బబుల్‌లోనే విమానాల రాకపోకలు సాగుతున్నాయి. దీంతో 2020 మార్చి 30 కంటే ముందు భారత్‌కు వచ్చిన విదేశీ పౌరులు అప్పటి నుంచి దేశంలో చిక్కుకుపోయారు. ఆ తర్వాత కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ విధించడంతో వీరు తమ వీసాల గడువును పెంచుకోవడం ఇబ్బందిగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోంశాఖ గతేడాది ఏప్రిల్‌ నుంచి పలుమార్లు విదేశీ పౌరుల వీసాల గడువును పెంచుతూ వస్తోంది. సదరు విదేశీయులు నెలా నెలా వీసా గడువు పెంపుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది.

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా కమర్షియల్‌ విమాన సర్వీసులు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో కేంద్ర హోంశాఖ.. వీసాల గడువు అంశాన్ని తాజాగా మరోసారి పరిశీలించింది. ఎలాంటి ఛార్జీలు, పెనాల్టీలు విధించకుండా ఆగస్టు 31 వరకు వీసాల గడువు పెంచుతున్నట్లు హోంశాఖ నేడు వెల్లడించింది. అంతేగాక, గడువు పెంపు కోసం విదేశీ పౌరులు ఎలాంటి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే వారు భారత్‌ను వదివి వెళ్లేముందు ఎగ్జిట్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని