Vistara: విమాన ప్రయాణికురాలి వీరంగం.. సిబ్బందిని కొట్టి, అర్ధ నగ్నంగా తిరిగి..!

విస్తారా విమానంలో ఓ ప్రయాణికురాలు వీరంగం సృష్టించారు. సిబ్బందిని కొట్టి, అర్ధనగ్నంగా తిరుగుతూ అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమెను సిబ్బంది నిర్బంధించి పోలీసులకు అప్పగించారు.

Published : 31 Jan 2023 11:02 IST

ముంబయి: విమానంలో ప్రయాణికుల అసభ్య చేష్టలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విస్తారా (Vistara) విమానంలో ఇటలీకి చెందిన ఓ 45 ఏళ్ల మహిళ వీరంగం సృష్టించింది. సిబ్బందిపై దాడి చేయడమే గాక, విమానంలో అర్ధ నగ్నంగా తిరుగుతూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

సోమవారం (జనవరి 30) అబుదబీ నుంచి ముంబయి వచ్చిన విస్తారా విమానం (Flight)లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎకానమీ క్లాస్‌ టికెట్ తీసుకున్న ఆ మహిళ తాను బిజినెస్‌ క్లాసులోనే కూర్చుంటానని పట్టుబట్టింది. అందుకు సిబ్బంది అంగీకరించకపోవడంతో వారిపై వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడింది. అంతటితో ఆగకుండా విమానంలో అటు ఇటూ అర్ధ నగ్నంగా తిరిగింది.

ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె వినిపించుకోకపోవడంతో కెప్టెన్‌ వార్నింగ్‌ కార్డ్‌ జారీ చేశారు. అనంతరం సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని ముంబయి ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. విమానం ల్యాండ్‌ అయిన తర్వాత ఆమెను అధికారులకు అప్పగించగా.. ఆ తర్వాత ముంబయి పోలీసులు ఆ ప్రయాణికురాలిని అరెస్టు చేశారు. ‘‘ప్రయాణికురాలి అసభ్య, హింసాత్మక ప్రవర్తన కారణంగా ఆమెను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఘటన గురించి ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బందికి సమాచారమిచ్చాం. వారు తగిన చర్యలు తీసుకున్నారు’’ అని విస్తారా ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇటీవల విమాన ప్రయాణికుల వికృత చేష్టల ఘటనలు తరచూ వార్తల్లో వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఎయిరిండియా విమానాల్లో మూత్ర విసర్జన ఘటనలు చోటుచేసుకోగా.. ఇటీవల గగనతలంలో కొందరు ప్రయాణికులు విమానం ఎమర్జెన్సీ తలుపులు తెరిచేందుకు ప్రయత్నించడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనల నేపథ్యంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ DGCA).. చర్యలకు ఉపక్రమించింది. మూత్ర విసర్జన ఘటనల్లో ఎయిరిండియా (Air India)కు జరిమానా విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు