Vivek Agnihotri: భద్రతా వలయంలో దర్శకుడి మార్నింగ్ వాక్‌.. ఘాటుగా స్పందించిన నెటిజన్లు

 రూ.25కోట్లతో తీసిన ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం సుమారు రూ.340 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తాజాగా షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. 

Published : 24 Dec 2022 01:14 IST

దిల్లీ: దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) షేర్‌ చేసిన మార్నింగ్ వాక్ వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రజల సొమ్ముతో చాటింపు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌(The Kashmir Files)’ సినిమాతో దేశవ్యాప్తంగా వివేక్ పేరు మార్మోగిపోయింది. అలాగే ఆ సినిమా విడుదలైన దగ్గరి నుంచి ఆయనకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. దాంతో ప్రభుత్వం ఆయనకు వై కేటగిరీ భద్రత( Y-category security) కల్పిస్తోంది. ఈ క్రమంలో ఆయన షేర్ చేసిన వీడియో నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

శుక్రవారం ఉదయం వివేక్‌ అగ్నిహోత్రి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లారు. ఆయనకు రక్షణగా ఐదుగురు భద్రతా సిబ్బంది కూడా వెంట ఉన్నారు. ఆ భద్రతావలయంలోనే చకచకా నడుచుకుంటూ వెళ్లారు. ఈ వీడియో షేర్ చేసిన ఆయన.. ‘కశ్మీర్‌లోని హిందువుల పట్ల జరిగిన ఆకృత్యాలను చూపించినందుకు చెల్లిస్తోన్న మూల్యమిది. హిందూ మెజార్టీ దేశంలో లభిస్తోన్న భావ ప్రకటనా స్వేచ్ఛ ఇది’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై వెంటనే నెట్టింట్లో ట్రోలింగ్ మొదలైంది.

పన్ను చెల్లింపుదారుల సొమ్ము ఇలా దుర్వినియోగం అవుతోందని నెటిజన్లు మండిపడ్డారు. ‘మీ భద్రతకు అయ్యే ఖర్చు ప్రజల సొమ్ము. దాంతో మీరు ఇలా చాటింపు చేసుకుంటున్నారు. మీపై దాడి జరిగే పరిస్థితులు లేవు. ఒకవేళ ఉంటే.. ప్రైవేటుగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవాల్సింది’ అని ఒకరు రాసుకొచ్చారు. ‘నిజానికి ఇదంతా మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేం నచ్చనట్టుగా నటించకండి’ అని మరొకరు ఘాటుగా ట్వీట్ చేశారు. 

1990లో జమ్మూ- కశ్మీర్‌లో అల్లరిమూకలు కశ్మీరీ హిందూవులపై దాడులకి తెగబడ్డాయి. ఆ ఆకృత్యాలను తట్టుకోలేక చాలామంది వలస వెళ్లిపోయారు. ఆనాటి పరిస్థితుల ఆధారంగా అగ్నిహోత్రి  ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ తెరకెక్కించారు. రూ.25కోట్లతో తీసిన ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం సుమారు రూ.340 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాలో ఓ వర్గాన్ని హంతకులుగా చూపించారంటూ వివేక్‌పై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే కేంద్రం వివేక్‌కు వై కేటగిరి భద్రత కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు