Sasikala: జయలలిత వైద్యంపై సంచలనాలు.. శశికళ స్పందన ఏంటంటే?

జయలలితకు అందించిన వైద్యం విషయంలో ఎలాంటి విచారణ ఎదుర్కొనేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆమె నెచ్చెలి శశికళ అన్నారు.

Updated : 19 Oct 2022 11:36 IST

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం, వైద్యం విషయమై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్‌ ఆరుముగస్వామి కమిషన్‌ ఇచ్చిన నివేదికపై ఆమె నెచ్చెలి శశికళ తీవ్రంగా స్పందించారు. శశికళ చెప్పినట్లుగానే జయకు చికిత్స అందిందని కమిషన్‌ చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. జయలలిత వైద్యం విషయంలో తాను ఏనాడూ జోక్యం చేసుకోలేదని.. దీనిపై ఎలాంటి విచారణ ఎదుర్కొనేందుకైనా సిద్ధమని శశికళ స్పష్టం చేశారు.

‘‘నాపై ఆరోపణలు చేస్తున్నందుకు నాకేం బాధ లేదు. ఇవన్నీ నాకేం కొత్తకాదు. కానీ ఇప్పుడు నా అక్క(జయలలిత) ప్రతిష్ఠకు కూడా భంగం కలుగుతున్నందుకు బాధగా ఉంది. నేను జైలుకు వెళ్లాక కొందరు అమ్మ మరణాన్ని తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారు. డీఎంకే కుట్రలకు లొంగిపోయారు. నన్ను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు చాలా మార్గాలుంటాయి. అంతేగానీ ఇలా అమ్మ మరణాన్ని ఉపయోగించుకోవడం క్రూరత్వం. ముందు అమ్మ మృతిని రాజకీయం చేశారు.. ఇప్పుడు ఆరుముగస్వామి కమిషన్‌ నివేదికను కూడా రాజకీయం చేస్తున్నారు’’ అని శశికళ ఆరోపించారు.

‘‘జయలలిత తొలుత చికిత్సకు స్పందించారు. కోలుకుని డిశ్చార్జ్‌ అవుతారు అనుకునేలోపే దురదృష్టవశాత్తూ మనల్ని వదిలి వెళ్లిపోయారు. కానీ, ఇప్పుడు కమిషన్‌ నాపై నిందలు వేస్తోంది. మాది 30ఏళ్ల స్నేహబంధం. అన్నేళ్లపాటు ఆమెను అమ్మలా కాపాడుకున్నా. ఆమె చికిత్స విషయంలో నేను ఏనాడూ జోక్యం చేసుకోలేదు. ఆమెకు అత్యుత్తమ వైద్యం అందించాలనే కోరుకున్నా. చికిత్స కోసం ఆమెను విదేశాలను తీసుకెళ్లకుండా నేనెప్పుడూ అడ్డుకోలేదు. ఎయిమ్స్‌ వైద్యులు కూడా ఆమెకు ‘యాంజియో’ పరీక్షలు అవసరం లేదనే చెప్పారు. ఊహాగానాలతో ఇచ్చిన ఈ నివేదికను ప్రజలెవరూ నమ్మరు. ఆరుముగస్వామి కమిషన్‌ చేసిన ఆరోపణలన్నింటినీ నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇందులో ఎలాంటి విచారణ ఎదుర్కోడానికైనా నేను సిద్ధమే’’ అని శశికళ తెలిపారు.

అనారోగ్యంతో కొన్నాళ్ల పాటు ఆసుపత్రిలో ఉన్న జయలలిత చికిత్స పొందుతూ 2016 డిసెంబరులో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఆమె మరణంపై అప్పట్లో అనేక అనుమానాలు రావడంతో అప్పటి ప్రభుత్వం జస్టిస్‌ ఆరుముగస్వామి నేతృత్వంలో కమిషన్‌ వేసింది. ఈ కమిషన్‌ విచారణ నివేదికను తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయగా.. దానిని మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. జయలలిత మరణం, ఆమెకు అందించిన వైద్యం విషయంలో మొత్తం 8 మందిపై కమిషన్‌ అభియోగాలు మోపింది. ముఖ్యంగా ఆమె నెచ్చెలి శశికళ చెప్పినట్లుగానే జయకు వైద్యం జరిగినట్లుగా ఉందని కమిషన్‌ అనుమానాలు వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని