Assembly elections 2022: ఒంటిగంటకు పోలింగ్‌ ఇలా.. కాషాయ కండువాతో సీఎం ఓటు..!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం రెండో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ దశలో ఉత్తరప్రదేశ్‌లోని 55 స్థానాలకు ఓటింగ్‌ జరుగుతుండగా.. ఉత్తరాఖండ్‌లోని

Published : 14 Feb 2022 14:30 IST

లఖ్‌నవూ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం రెండో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ దశలో ఉత్తరప్రదేశ్‌లోని 55 స్థానాలకు ఓటింగ్‌ జరుగుతుండగా.. ఉత్తరాఖండ్‌లోని మొత్తం 70, గోవాలోని మొత్తం 40 నియోజకవర్గాలకు ఒకే విడత పోలింగ్‌ నేడు కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి యూపీలో 39.07శాతం, ఉత్తరాఖండ్‌లో 35.21శాతం, గోవాలో 44.63శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓటు వేసేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవడంలో భద్రతా సిబ్బంది సాయం చేస్తున్నారు. వారిని దగ్గరుండి పోలింగ్‌ కేంద్రాలకు చేరుస్తున్నారు.

కోడ్‌ ఉల్లంఘించిన ఉత్తరాఖండ్‌ సీఎం

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామి, ఆయన సతీమణి గీత ఖతిమాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఆ సమయంలో వీరు కాషాయ కండువాలను ధరించడం చర్చనీయాంశంగా మారింది. ఆ కండువాలపై భాజపా గుర్తు కమలం పువ్వు కూడా ఉంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి సీఎం దంపతులు భాజపా కండువాలు ధరించి ఓటు వేయడంపై విమర్శలు వస్తున్నాయి. అంతేగాక, ఓటు వేసిన అనంతరం సీఎం సతీమణి పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రచారం చేస్తూ కనిపించారు. 

భాజపా అభ్యర్థి కారుపై దాడి..

ఉత్తరప్రదేశ్‌లో రెండో విడత పోలింగ్‌ వేళ.. ఓ భాజపా అభ్యర్థి కారుపై దాడి జరగడం కలకలం రేపుతోంది. సాంబల్‌ జిల్లాలోని అస్మోలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న భాజపా నేత హరేంద్ర అలియాస్‌ రింకు వాహనంపై నిన్న రాత్రి కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలియా దేవీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఖిర్నీ గ్రామంలో హరేంద్ర ఓటర్లకు మద్యం పంచుతున్నారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా.. హరేంద్ర కారులో మద్యం సీసాలు లభించలేదు. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు హరేంద్ర వాహనంపై దాడి చేశారు. ఆయనపైనా దాడి చేసేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వెంటనే ఆయనను సమీపంలోని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆందోళనకారుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్లు భాజపా ఆరోపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని