Jagdeep Dhankhar: మోదీ తోడుగా.. ధన్‌ఖడ్‌ నామినేషన్‌

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పరిణామాలతో దేశ రాజధాని దిల్లీలో సందడి నెలకొంది. దేశ తదుపరి రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు నేడు పోలింగ్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే. అదే సమయంలో

Published : 18 Jul 2022 13:24 IST

దిల్లీ: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన పరిణామాలతో దేశ రాజధాని దిల్లీలో సందడి నెలకొంది. దేశ తదుపరి రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు నేడు పోలింగ్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌ నేడు నామినేషన్‌ వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెంట రాగ.. ధన్‌ఖడ్‌ తన నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు.

నామినేషన్‌ నిమిత్తం దిల్లీ వెళ్లిన దన్‌ఖడ్‌ ఈ ఉదయం పార్లమెంట్‌కు వెళ్లి ఎన్డీయే ఎంపీలతో సమావేశమయ్యారు. తనకు మద్దతిచ్చినవారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రధాని మోదీతో కలిసి వెళ్లి నామినేషన్‌ సమర్పించారు. ఆయన వెంట భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉన్నారు. నామినేషన్ అనంతరం దన్‌ఖడ్‌ మాట్లాడుతూ.. రైతు కుటుంబం నుంచి వచ్చిన తన లాంటి సామాన్య వ్యక్తికి ఇలాంటి గొప్ప అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఇందుకు ప్రధాని మోదీ, ఎన్డీయే నాయకత్వానికి రుణపడి ఉంటానన్నారు. దేశ ప్రజాస్వామ్య విలువలను మరింత పెంచేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు.

ఎన్డీయే కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాజస్థాన్‌ ఓబీసీ జాట్‌ సామాజిక వర్గానికి చెందిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ పేరును గత శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. సాగుచట్టాల ఆందోళన కారణంగా భాజపాకు దూరమైన జాట్‌ సామాజిక వర్గంతోపాటు రైతులను ప్రసన్నం చేసుకొనే ఉద్దేశంతోనే భాజపా నాయకత్వం అనూహ్యంగా ధన్‌ఖడ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కర్ణాటకకు చెందిన మహిళా నేత మార్గరెట్ ఆళ్వా పోటీకి దిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని