Sameer Wankhede: ఆ మెసేజ్‌లను నిర్దోషిత్వానికి సర్టిఫికెట్‌గా చూపుతున్నారు: సీబీఐ

గత నాలుగు రోజులుగా తన కుటుంబానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నాయని ముంబయి మాజీ ఎన్‌సీబీ డైరెక్టర్‌ సమీర్ వాంఖడే (Sameer Wankhede) ఆరోపించారు.

Published : 22 May 2023 22:54 IST

ముంబయి: బాలీవుడ్ నటుడు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)తో జరిపిన ఫోన్‌చాట్‌ సంభాషణలను తన నిజాయితీకి సర్టిఫికేట్‌గా చూపేందుకు సమీర్‌ వాంఖడే (Sameer Wankhede) ప్రయత్నిస్తున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ (CBI) ఆరోపించింది. ఈ మేరకు వాంఖడే బాంబే హైకోర్టు (Bombay High Court)లో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జూన్‌ 8 వరకు వాంఖడేపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని బాంబే హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ మరోసారి ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు, క్రూయిజ్‌ నౌక కేసు నుంచి ఆర్యన్‌ను తప్పించాలని షారుఖ్‌ తనను వేడుకున్నారని వాంఖడే కోర్టుకు తెలిపారు. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన బాంబే హైకోర్టులో గత వారం పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో షారుక్‌ తనకు పంపినవిగా చెబుతున్న వాట్సాప్‌ సంభాషణలను కోర్టుకు సమర్పించారు. అయితే, ఆ వాట్సాప్‌ సంభాషణలను వాంఖడే తన నిర్దోషిత్వానికి సర్టిఫికెట్‌గా చూపే ప్రయత్నం చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది. కానీ, సీబీఐ ఈ కేసులో తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేసిందని వాంఖడే తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలానే, కేసు గురించి మీడియాతో మాట్లడవద్దని హైకోర్టు వాంఖడేకు సూచించింది. 

మరోవైపు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు, కుంటుంబానికి ప్రాణహాని ఉందని వాంఖడే పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ముంబయి పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. గత నాలుగు రోజులుగా తన భార్య క్రాంతి రెడ్కర్‌ ఫోన్‌కు, తన ఫోన్‌కు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని చెప్పారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. 

గతేడాది క్రూయిజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో షారుఖ్‌ పెద్ద కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను ముంబయి ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న సమీర్‌ వాంఖడే ఆర్యన్‌ ఖాన్‌ను తప్పించేందుకు రూ. 25 కోట్లు లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ గతవారం సీబీఐ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఇందుకోసం అడ్వాన్సుగా రూ.50లక్షలు స్వీకరించినట్లు సీబీఐకి సమాచారం అందింది. దీంతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. వాంఖడే సహా మరికొందరిపై కేసు నమోదు చేసింది.

సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వాంఖడే గత శుక్రవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మే 22 వరకు వాంఖడేపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు సీబీఐ అధికారులను ఆదేశించింది. తాజాగా సోమవారం మరోసారి వాంఖడే పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం జూన్‌ 8 వరకు ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టరాదని సీబీఐకి సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు