jammu and kashmir: హిజ్బుల్‌ కీలక కమాండర్‌ పాక్‌లో హత్య..!

భారత్‌కు వాంటెడ్‌ అయిన ఓ తీవ్రవాది పాక్‌లో  హత్యకు గురయ్యాడు. అక్కడ పట్టపగలే అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. 

Published : 21 Feb 2023 19:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు చెందిన కీలక కమాండర్‌ను పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. హిజ్బుల్‌కు చెందిన బషీర్‌ అహ్మద్‌ పీర్‌ అలియాస్‌ ఇంతియాజ్‌ ఆలమ్‌ కొత్తగా నియమించిన ఉగ్రవాదులను కశ్మీర్‌కు చేర్చే బాధ్యత నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కశ్మీర్‌లోకి చొరబడే మార్గాలను వెతికి వారికి అవసరమైన లాజిస్టిక్స్‌ను అందజేస్తుంటాడు. ఐదు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. అంతేకాదు. హిజ్బుల్‌ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌కు ఇతడు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. 

అతడు ఫిబ్రవరి 20వ తేదీన ఇస్లామాబాద్‌లోని రావాల్పిండి ఏరియాలో ఓ దుకాణం బయట నిలబడి ఉండగా గుర్తు తెలియని దుండగులు వచ్చి కాల్పులు జరిపారు. అతడు ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని బద్ర్‌పోరా ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతడు దాదాపు 2000 సంవత్సరం నుంచి పాకిస్థాన్‌లోనే ఉంటూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నాడు.  2007లో అతడు 12 మంది సభ్యుల బృందాన్ని హిజ్బుల్‌ నార్తర్న్‌ డివిజన్‌ కమాండర్‌ మహమ్మద్‌ షరీఫ్‌దార్‌కు మద్దతుగా పంపాడు. ఆ సమయంలో పాక్‌ మిలటరీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ అతడిని అరెస్టు చేసింది. కానీ, ఆ తర్వాత ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు విడుదల చేసింది.  

కేంద్రం ప్రభుత్వం 2022 అక్టోబర్లో బషీర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడిని కేడర్‌ హిజ్బుల్‌ లాంఛింగ్‌ కమాండర్‌గా వ్యవహరిస్తుంది. కుప్వారా ప్రాంతంలో జరిగే చొరబాట్లు,  ఇతర ఉగ్రసంస్థలతో సమన్వయం చేసుకొంటూ దాడులు చేయడం వంటివి నిర్వహించేవాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని