Rajnath Singh: తండ్రి మరణంతో సైన్యంలో చేరలేకపోయా.. రాజ్‌నాథ్‌ సింగ్‌ భావోద్వేగం

సైన్యంలో చేరి దేశ సేవ చేయాలని తాను చిన్ననాటి నుంచి కలలు కన్నానని, అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా చేరలేకపోయానని

Updated : 19 Aug 2022 15:18 IST

ఇంఫాల్‌: సైన్యంలో చేరి దేశ సేవ చేయాలని తాను చిన్ననాటి నుంచి కలలు కన్నానని, అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా చేరలేకపోయానని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో పర్యటిస్తోన్న ఆయన.. అక్కడి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అస్సాం రైఫిల్స్‌(సౌత్‌) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అస్సాం రైఫిల్స్‌, రెడ్‌ షీల్డ్‌ డివిజన్‌ బృందాలను ఉద్దేశిస్తూ ప్రసంగించిన ఆయన తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

‘‘నా జీవితంలో జరిగిన ఓ సంఘటనను మీతో పంచుకోవాలనుకుంటున్నా. నాకు చిన్ననాటి నుంచి ఆర్మీలో చేరాలనే కోరిక ఉండేది. అందుకు సన్నద్ధమయ్యాను కూడా. ఒకసారి షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకుని రాత పరీక్షకు హాజరయ్యా. అయితే కుటుంబంలో ఎదురైన అనుకోని పరిస్థితులు, నా తండ్రి మరణంతో నేను సైన్యంలో చేరలేకపోయా’’ అని రాజ్‌నాథ్‌ నాటి సంగతులను గుర్తుచేసుకుంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆర్మీ యూనిఫామ్‌కు ఒక ఛరిష్మా ఉంటుందని ఆయన అన్నారు. సైనిక దుస్తులను చిన్న పిల్లవాడికి ఇచ్చినా అతడి వ్యక్తిత్వంలో దేశభక్తితో కూడిన మార్పు కన్పిస్తుందన్నారు.

ఈ సందర్భంగా సైనికుల శౌర్యపరాక్రమాలను రాజ్‌నాథ్ కొనియాడారు. ‘‘నేను ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా అక్కడి జవాన్లను కలుస్తాను. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మిమ్మల్ని కలవడం నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. డాక్టర్లు, ఇంజినీర్లు, ఛార్టెడ్‌ అకౌంటెంట్లు దేశానికి ఓ మార్గంలో సేవ చేస్తున్నారు. కానీ, మీరు నిర్వహించే బాధ్యతలు ఓ వృత్తి కంటే, సేవ కంటే కూడా ఎంతో ఎక్కువ అని నేను విశ్వసిస్తా’’ అని కేంద్రమంత్రి ప్రశంసించారు. అంతకుముందు జవాన్లతో రాజ్‌నాథ్‌ కాసేపు సరదాగా ముచ్చటించారు. వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని