Rana Kapoor: ‘పద్మభూషణ్‌ ఇప్పిస్తామని ₹2 కోట్ల పెయింటింగ్‌ కొనిపించారు’

అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం కింద తనపై జరుగుతున్న కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు యెస్‌ బ్యాంక్‌ సహ-వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ కీలక ఆరోపణలు చేశారు.....

Updated : 24 Apr 2022 12:00 IST

ఈడీ విచారణలో యెస్‌ బ్యాంక్‌ సహ-వ్యవస్థాపకుడు రాణా కపూర్

ముంబయి: అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (PMLA) కింద తనపై జరుగుతున్న కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ముందు యెస్‌ బ్యాంక్‌ సహ-వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ (Rana Kapoor) కీలక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నుంచి రూ.రెండు కోట్లతో ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్ హుస్సేన్‌కు సంబంధించిన పెయింటింగ్‌ను​ కొనుగోలు చేయాలని  తనను బలవంతం చేసినట్లు ఆయన ఆరోపించారు.

నాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న మురళీ దేవరా ఈ మేరకు తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. బదులుగా తనకు పద్మభూషణ్​ పురస్కారం లభిస్తుందనే హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ వివరాలను ముంబయిలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఈడీ ప్రస్తావించింది.

చెక్కు ద్వారా తాను అందించిన రూ.2 కోట్లను న్యూయార్క్‌లో సోనియా గాంధీ చికిత్స కోసం వినియోగించినట్లు మురళీ దేవరా తనయుడు మిలింద్‌ దేవరా తనకు తర్వాత ఓ సందర్భంలో రహస్యంగా తెలిపినట్లు రాణా కపూర్ చెప్పారు. అయితే తనకు ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదని అన్నారు. ‘‘సోనియా చికిత్సకు సహకరించడం ద్వారా ఆ కుటుంబానికి చాలా మంచి పని చేశానని ఆమె సన్నిహితుడు అహ్మద్​పటేల్ నాతో ఓ సందర్భంలో అన్నారు. నాకు పద్మభూషణ్ అందడంలో ఇది తోడ్పడుతందని చెప్పారు. అయితే ఈ కొనుగోలు బలవంతంగా జరిగింది. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు’’ అని రాణా పేర్కొన్నట్లు ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది.

దేవాన్‌ హౌసింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్ (DHFL) సంస్థకు ఆర్థిక సహాయం అందించేందుకు నేరపూరితంగా వ్యవహరించటంతో పాటు ప్రతిగా రూ.600 కోట్లు లబ్ధి పొందారనే ఆరోపణలతో ఈడీ, సీబీఐ సంస్థలు రాణా కపూర్, ఆయన కుటుంబం, డీహెచ్‌ఎఫ్ఎల్ ప్రమోటర్‌ కపిల్ వాధ్వాన్‌లపై వేర్వేరుగా కేసు నమోదు చేసింది. ప్రస్తుతం రాణా కపూర్‌ జ్యుడీషియల్‌ కస్టడిలో ఉన్నారు. రాణా కపూర్, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు కపిల్, ధీరజ్‌ వాధ్వాన్‌లు అనుమానాస్పద లావాదేవీల ద్వారా రూ.5,050 కోట్ల నగదును అక్రమంగా బదిలీ చేశారని ఈడీ తాజాగా ప్రత్యేక కోర్టులో సమర్పించిన ఛార్జిషీటులో పేర్కొంది.

ఖండించిన కాంగ్రెస్‌..

ఈడీ ఛార్జిషీట్‌లో పేర్కొన్నట్లుగా రాణా కపూర్‌ చేసిన ఆరోపణల్ని కాంగ్రెస్‌ వర్గాలు ఖండించాయి. తెలివిగా దివంగతులైన వారిపై ఆరోపణలు చేశారని ఓ కీలక నేత వ్యాఖ్యానించారు. రూ.5,000 కోట్ల కుంభకోణంలో చిక్కుకున్న వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం అని అన్నారు. రాణా కపూర్‌ తన ఆరోపణల్లో పేర్కొన్న ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు మురళీ దేవరా, అహ్మద్‌ పటేల్‌ మరణించిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని