డోక్లాం సమయంలో.. రాహుల్‌ చైనా అధికారులతో లేరా?: అనురాగ్‌ ఠాకూర్‌ కౌంటర్‌

తవాంగ్‌లో భారత్‌-చైనా బలగాల ఘర్షణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. దీనిపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందిస్తూ.. కాంగ్రెస్‌ నేతపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Published : 19 Dec 2022 17:15 IST

దిల్లీ: యుద్ధానికి చైనా సిద్ధమవుతుంటే భారత ప్రభుత్వం నిద్రపోతోందంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi ) చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. తాజాగా ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) మండిపడ్డారు. డోక్లాం పతిష్టంభన సమయంలో చైనీస్‌ అధికారులతో కలిసి విందు ఆరగించిన వారికి(రాహుల్‌ను ఉద్దేశిస్తూ) ప్రశ్నలు అడిగే అర్హత లేదంటూ కాంగ్రెస్‌ నేతను దుయ్యబట్టారు.

‘‘తవాంగ్‌ (Tawang Sector) అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించే ముందు.. రాహుల్‌జీ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఢోక్లాం విషయంలో భారత సైన్యం.. చైనా (China) బలగాలతో పోరాటం చేస్తున్నప్పుడు మీరు చైనీస్‌ అధికారులతో కలిసి ఏం చేస్తున్నారు?ఆ సమయంలో ఆయన ఆర్మీని ప్రశ్నించారా? చైనీస్‌ అధికారుల నుంచి రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ విరాళాలు తీసుకోవట్లేదా? వీటిపై రాహుల్‌జీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు’’ అని ఠాకూర్‌ ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. సాయుధ బలగాలకు బులెట్‌ప్రూఫ్‌ జాకెట్లు, రఫేల్‌ యుద్ధ విమానాల వంటి అత్యాధునిక సదుపాయాలు/ఆయుధాలను కల్పించలేదని అనురాగ్‌ ఠాకూర్‌ విమర్శించారు. మోదీ హయాంలో తమ ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠిన నిర్ణయాలు తీసుకోవడమే గాక, అవి సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. ‘‘ఉరి ఉగ్రదాడికి ప్రతీకారంగా 2016లో సర్జికల్‌ స్ట్రైక్స్, పుల్వామా బాంబు పేలుడుకు స్పందనగా 2019లో బాలాకోట్‌ వైమానిక దాడులు చేపట్టాం. అవన్నీ కచ్చితమై ఫలితాలనిచ్చాయి. 2014 నుంచి చొరబాట్లు, హింస 80శాతం తగ్గాయి. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద సంబంధ ఘటనలు 168 శాతం తగ్గాయి’’ అని ఠాకూర్‌ చెప్పారు.

ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌ వద్ద భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంట యథాస్థితిని మార్చేందుకు చైనా సైన్యం ప్రయత్నించగా.. భారత బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి. ఈ ఘటనపై రాహుల్‌ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే.. మన ప్రభుత్వం మాత్రం నిద్రపోతోందని దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. రాహుల్‌ విమర్శలను భాజపా (BJP) నేతలు తీవ్రంగా ఖండించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని