
Afghanistan Crisis: వాటర్ బాటిల్ ధర ₹3వేలు.. ప్లేటు భోజనం ₹7వేలు పైనే..!
కాబుల్ విమానాశ్రయం పరిసరాల్లో పరిస్థితులు దయనీయం
కాబుల్: తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాక అఫ్గానిస్థాన్‌లో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్ల అరాచకాల నుంచి తప్పించుకొనేందుకు బయటి దేశాలకు పారిపోయే క్రమంలో అక్కడి ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణానాతీతంగా ఉన్నాయి. ఎలాగైనా దేశం దాటిపోవాలనే ఉద్దేశంతో రోజుల తరబడి వేచిచూస్తున్న అక్కడి ప్రజలకు తిండి, తాగునీరు కూడా కరవైంది. దీంతో చిన్నారులు, మహిళల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇలాంటి తరుణంలో ప్రజల నిస్సహాయతను సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా అక్కడి కొందరు వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలను అమాంతం పెంచేశారు. దీంతో విమానాశ్రయం బయట దుకాణాల్లో వస్తువుల ధరలకు రెక్కలొచ్చి ఆకాశాన్ని తాకాయని అఫ్గాన్‌కు చెందిన ఫజల్ ఉర్ రెహమాన్ అనే వ్యక్తి ‘రాయిటర్స్’ వార్తా సంస్థకు తెలిపారు. ఒక వాటర్ బాటిల్ ధర 44 అమెరికన్ డాలర్లు (₹3వేలు) కాగా.. ప్లేటు భోజనం ధర ఏకంగా 100 డాలర్ల (₹7000కు పైనే)కు విక్రయిస్తున్నట్టు చెప్పాడు. విమానాశ్రయం బయట ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవంటూ ఫజల్ ఉర్ రెహమాన్ చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మరోవైపు, తాలిబన్లు శాంతి వచనాలు ప్రవచిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో ప్రజలు బతుకు జీవుడా.. అంటూ ఏదో ఒక దేశానికి తరలిపోయేందుకు భారీగా విమానాశ్రయం వద్దకు చేరుకుంటున్నారు. ఆగస్టు 31లోపు తరలింపును పూర్తి చేయాలంటూ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు తాలిబన్లు విధించిన డెడ్‌లైన్ సమీపిస్తుండటం అక్కడ మరింత రద్దీ వాతావరణం నెలకొంది. జంట పేలుళ్ల ఘటనతో అప్రమత్తమైన దేశాలు తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. యూకే, స్పెయిన్ ఇప్పటికే తరలింపు ప్రక్రియను ముగించబోతున్నట్టు ప్రకటించగా.. అఫ్గానిస్థాన్ నుంచి ఇంకా వందలాది మంది తమ పౌరులను అమెరికా తరలించాల్సి ఉంది. వేలాది మంది అఫ్గాన్ పౌరులు కాబుల్ విమానాశ్రయం గేటు వద్ద ఎదురుచూస్తున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.