CJI DY Chandrachud: భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కదా.. రిజిజుతో వివాదంపై సీజేఐ వ్యాఖ్య

ఏ వ్యవస్థ పరిపూర్ణమైనది కాదని, అయితే జడ్జీల నియామక ప్రక్రియలో మనం రూపొందించుకున్న కొలీజియం.. ఉత్తమమైన వ్యవస్థ అని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ (Justice DY Chandrachud) తెలిపారు.

Published : 18 Mar 2023 18:19 IST

దిల్లీ: న్యాయ వ్యవస్థకు ‘భారతీయత’ను జోడించాల్సిన అవసరం ఉందని, స్థానిక బాషలతోనే ప్రజలకు చేరువ కాగలమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ (CJI Chandrachud) అన్నారు. దిల్లీలో శనివారం జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కొలీజియం వ్యవస్థ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju)తో విభేదాలు తదితర అంశాలపై అంశాలపై స్పందించారు.

‘‘న్యాయవ్యవస్థ (Judiciary)లో భారతీయతను తీసుకురావాలి. అందులో మొట్టమొదటిది కోర్టుల్లో ఉపయోగించే భాష. జిల్లా కోర్టుల్లో వాదనలు కేవలం ఇంగ్లీష్‌లోనే ఉండకపోవచ్చు. కానీ పై కోర్టులు, ఉన్నత న్యాయస్థానాలు, సుప్రీంకోర్టులో ఇంగ్లీష్‌లోనే వాదిస్తున్నారు. అది వలస వారసత్వం వల్లనో.. లేదా ఆంగ్ల భాషలో ఉన్న సౌలభ్యం వల్లనో కావొచ్చు. కానీ, ప్రజలకు నిజంగా చేరువవ్వాలంటే వారికి అర్థమయ్యే భాషతోనే  సాధ్యమవుతుంది. అందుకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం’’ అని సీజేఐ (Justice DY Chandrachud) వెల్లడించారు.

ఎవరి అభిప్రాయం వారిదే..

కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య చోటుచేసుకున్న వివాదం గురించి సేజేఐ స్పందిస్తూ.. ‘‘ఆ విషయంలో న్యాయశాఖ మంత్రితో వాదనలు చేయాలనుకోవట్లేదు. ఆయనకో అభిప్రాయం ఉంది, నాకో అభిప్రాయం ఉంది. భిన్నమైన అభిప్రాయాలు ఉంటే తప్పేంటీ?  న్యాయవ్యవస్థలోనూ అభిప్రాయభేదాలు ఎదురవుతుంటాయి’’ అని వ్యాఖ్యానించారు. ఇక ఏ వ్యవస్థా పరిపూర్ణమైనది కాదన్న సీజేఐ... జడ్జీల నియామక ప్రక్రియలో మనం రూపొందించుకున్న కొలీజియం ఉత్తమమైన వ్యవస్థ అని తెలిపారు.

తీర్పుల్లో ఇతరుల జోక్యం గురించి మాట్లాడుతూ ‘‘కేసుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు. న్యాయమూర్తిగా నా 23 ఏళ్ల కెరీర్‌లో ఏదైనా కేసు విషయం ఇలాంటి తీర్పు ఇవ్వమని ఎవరూ నాకు చెప్పలేదు’’ అని సీజేఐ వెల్లడించారు. కాగా ఓ ప్రత్యక్ష చర్చా వేదికలో సిట్టింగ్‌ సీజేఐ పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని