Modi: రాబోయేది అంతరిక్ష యుగం.. భారత్‌ ఇక్కడే ఆగిపోకూడదు

‘‘ఇప్పుడు ప్రపంచమంతా సమాచార సాంకేతిక యుగం నుంచి అంతరిక్ష యుగం వైపు దూసుకెళ్తోంది. భారత్ ఇక్కడే ఆగిపోకూడదు. దేశ ప్రజల సంక్షేమంలో స్పేస్‌ టెక్నాలజీ

Published : 11 Oct 2021 23:44 IST

దిల్లీ: ‘‘ఇప్పుడు ప్రపంచమంతా సమాచార సాంకేతిక యుగం నుంచి అంతరిక్ష యుగం వైపు దూసుకెళ్తోంది. భారత్ ఇక్కడే ఆగిపోకూడదు. దేశ ప్రజల సంక్షేమంలో స్పేస్‌ టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుంది’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. దేశ అంతరిక్ష పరిశ్రమ, శాటిలైట్‌ కంపెనీలు తమ గళాన్ని వినిపించేందుకు ఏర్పాటైన ‘భారత అంతరిక్ష సంఘాన్ని(ఇండియన్‌ స్పేస్‌ అసోసియేషన్‌)’ ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. 

‘‘ఈ 21వ శతాబ్దంలో ప్రపంచాన్ని అనుసంధానించడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషించనుంది. గతంలో అంతరిక్ష రంగం కేవలం ప్రభుత్వానికే పరిమితమైంది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వాటికి అనుగుణంగా ఈ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. అంతరిక్షం నుంచి రక్షణ రంగం వరకూ అనేక వాటిల్లో ప్రైవేటు వ్యక్తులకు భాగస్వామ్యం కల్పిస్తున్నాం. ఆత్మనిర్భర్‌ భారత్‌ వల్లే ఇది సాధ్యమైంది’’ అని మోదీ చెప్పుకొచ్చారు.

అంతరిక్ష రంగంలో సంస్కరణల కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నాలుగు అంశాలపై ఆధారపడి ఉన్నాయని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రైవేటు రంగ ఆవిష్కరణ స్వేచ్ఛను అనుమతించడం, ప్రభుత్వం వెనకుండి ఇతరులను ప్రోత్సహించడం, భవిష్యత్తు కోసం దేశ యువతను సిద్ధం చేయడం, అంతరిక్ష రంగాన్ని సామన్యుడి అభివృద్దికి వనరుగా మార్చడం.. ఈ అంశాలను ఆధారం చేసుకునే స్పేస్‌ సెక్టార్‌లో మార్పులు తీసుకొస్తున్నామని మోదీ వివరించారు. 

ఇండియన్‌ స్పేస్ అసోసియేషన్ అనేది అంతరిక్ష, ఉపగ్రహ సంబంధిత అగ్రశ్రేణి పరిశ్రమల సంఘం. ఇందులో ఎల్‌ అండ్‌ టీ, నెల్కో(టాటా గ్రూప్‌), వన్‌ వెబ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, మ్యాప్‌మైఇండియా, వాల్‌చంద్‌నగర్‌ ఇండస్ట్రీస్‌, అనంత్‌ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థలు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి. గోద్రేజ్‌, హ్యూస్‌ ఇండియా, అజిస్టా-బీఎస్‌టీ ఏరోస్పేస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, బీఈఎల్‌, సెంటమ్‌ ఎలక్ట్రానిక్స్‌, మాక్సర్‌ ఇండియా కోర్‌ సభ్యులుగా ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని