అలసట మనకే.. వైరస్‌కు కాదు: కేంద్రం

దేశంలోని 10 రాష్ట్రాల్లో కరోనా మరణాలు అధికంగా నమోదువుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని విజ్ఞప్తి చేసింది. ....

Published : 30 Apr 2021 22:24 IST

నిర్లక్ష్యంగా ఉండొద్దు.. అనవసర భయం వద్దు 

దిల్లీ: దేశంలోని 10 రాష్ట్రాల్లో కరోనా మరణాలు అధికంగా నమోదువుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని విజ్ఞప్తి చేసింది. దేశంలో కరోనా పరిస్థితిని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. అలసట మనకే తప్ప వైరస్‌కు కాదన్న విషయాన్ని దేశ ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వాలు జారీ చేసిన నిబంధనలను పాటించాలని కోరారు. గత నాలుగు వారాలుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌‌, కర్ణాటక, యూపీ, దిల్లీ, తమిళనాడు, పంజాబ్‌లలో మరణాలు పెరుగుతున్నాయని వివరించారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి రోజువారీ కేసులు పెరుగుతూ ఆరోగ్య వ్యవస్థపై భారాన్ని మోపాయన్నారు. గతంతో పోలిస్తే సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉందని, రాజస్థాన్, యూపీలలో 5రెట్లు వైరస్‌ ఉద్ధృతి పెరగ్గా.. ఛత్తీస్‌గఢ్ 4.5 రెట్లు, దిల్లీలో 3.3రెట్లు పెరిగినట్టు తెలిపారు. 

ఆ ప్రవర్తన వల్లే కరోనా ఉద్ధృతి!

కరోనా ఓ స్కామ్‌.. ప్రాణాలకు ఏమీ కాదు..  నాకు మాస్క్‌ అవసరం లేదనే ప్రవర్తన వల్లే దేశంలో కేసులు భారీగా పెరుగుతున్నాయని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అన్నారు.  అనవసరమైన భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని సూచించారు. మాస్క్‌ ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడంద్వారా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చన్నారు. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను పాటిస్తూ పూర్తిగా రికవరీ అయ్యే వరకు వైద్యుల సలహాలను పాటించాలన్నారు. అనవసర ఆందోళన మరిన్ని క్లిష్ట పరిస్థితులకు కారణమవుతుందని తెలిపారు. కరోనా గొలుసును ఛేదించడంలో అందరూ భాగస్వాములుకావాలని విజ్ఞప్తి చేశారు. 

భయం నుంచి బయటపడండి

భయం వాతావరణం నుంచి బయటపడాలని లవ్‌ అగర్వాల్‌ కోరారు. ఆస్పత్రుల్లో కొవిడ్ రోగులు తమ కుటుంబ సభ్యులతో ఆడియో, వీడియో కాల్‌లో మాట్లాడేలా సదుపాయం ఉండేలా చూడాలన్నారు.అలాగే, వారితో పాటు అటెండర్లు ఉంటే మాట్లాడుకొనే వీలు కల్పించాలని సూచించారు. కంటెయిన్‌మెంట్‌, సర్వైలెన్స్‌ వ్యూహాలను పటిష్టంగా అమలుపరచాలన్నారు. 

ఆక్సిజన్‌ సరఫరాపై 24*7 కంట్రోల్‌ రూమ్‌ 

దేశంలో సరిపడా లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నట్టు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. రాష్ట్రాలకు కేటాయించే అంశంపై రోజువారీ సమీక్షిస్తున్నట్టు చెప్పారు. ఏ ఆస్పత్రిలోనూ ఆక్సిజన్‌ కొరత లేకుండా చూసేందుకు వీలుగా రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొనేందుకు 24*7 కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. భారతీయ రైల్వే, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ సంస్థలు ఆక్సిజన్‌ సజావుగా సరఫరా జరిగేలా దోహదం చేస్తున్నాయన్నారు. ఇప్పటివరకు 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాతలకు 8,593 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను కేటాయించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

కొవిడ్‌ రోగులకు కొన్ని సూచనలు

* కుటుంబ సభ్యులకు దూరంగా ఐసోలేట్‌ అవ్వండి. వెలుతురు ఎక్కువగా ఉండే గదిలో ఉండండి.

* ట్రిపుల్‌ లేయర్‌ మాస్క్‌ ధరించండి. ఎనిమిది గంటలకు ఓసారి దాన్నిమార్చేయండి.

* మీ సంరక్షణ చూసేవారు గదిలోకి వచ్చే సమయంలో ఇద్దరూ ఎన్‌ 95 మాస్క్‌ ధరించాలి.

* తగిన విశ్రాంతి అవసరం. శరీరానికి తగినంత నీరు అందేలా జాగ్రత్త వహించండి

* తరచూ చేతులు కడుక్కోండి. పరిశుభ్రత పాటించండి.

* మీ వస్తువులను ఇంట్లో ఎవరితోనూ పంచుకోవద్దు.

* గదిలో మీరు తాకిన ప్రదేశాలను శుభ్రం చేసుకోండి. ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోండి.

* ఎప్పటికప్పుడు శరీర ఉష్ణోగ్రతలు చెక్‌ చేసుకోండి. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి ఎలా ఉందో చూసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని