Kejriwal: మాకు దోచుకోవడం తెలియదు.. స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించడమే తెలుసు

తమకు అవినీతి, దోచుకోవడం అంటే తెలియవని.. కేవలం పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించడం మాత్రమే తెలుసునని ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Published : 09 May 2022 02:02 IST

దేశాన్ని రక్షించడమే తమ లక్ష్యమన్న అరవింద్‌ కేజ్రీవాల్‌

దిల్లీ: తమకు అవినీతి, దోచుకోవడం అంటే తెలియవని.. కేవలం పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించడం మాత్రమే తెలుసునని ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. దిల్లీ, పంజాబ్‌లలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తమ పార్టీ తదుపరి లక్ష్యం 2024 లోక్‌సభ ఎన్నికల మీదేనని స్పష్టం చేశారు. అయితే, ఎన్నికలు తమ లక్ష్యం కాదన్న ఆయన.. దేశవ్యాప్తంగా మార్పు తేవడమే తమ ఆశయమన్నారు. దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన అరవింద్‌ కేజ్రీవాల్, దేశాన్ని రక్షించేందుకే తాము రాజకీయాల్లో చేరినట్లు వెల్లడించారు.

‘మహారాష్ట్రలో పాఠశాలల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మొదట్లో దిల్లీలో అలాగే ఉన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు 97శాతం ఫలితాలు సాధిస్తున్నారు. పాత పాఠశాలల భవనాలను కూల్చివేసి వాటిస్థానంలో కొత్తగా లగ్జరీ భవనాలను నిర్మించాం. అందులో లిఫ్టులు, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి సౌకర్యాలు కల్పించాం. దీంతో ప్రైవేటు నుంచి 4లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరిపోయారు’ అని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఇక తాము వృత్తిలో భాగంగా రాజకీయాల్లో చేరలేదని, మాతృదేశం కోసం, దేశాన్ని రక్షించుకోవడం కోసమే రాజకీయాల్లో చేరామన్నారు. ఈ సమయంలో నేను భగవంతుడిని రెండే విషయాలు అడుగుతాను. ప్రపంచంలోనే నెం.1 దేశంలో భారత్‌ ఎదగాలని.. అది చూసేంత వరకు నేను బతికుండాలని మాత్రమే కోరుకుంటానని అన్నారు.

‘మాకు రాజకీయాలు తెలియవు, కేవలం పనిచేయడం మాత్రమే తెలుసు. ఉచిత విద్య విషయంలో ఇతర పార్టీలు నన్ను తిడుతుంటాయి. పేద ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తున్నాం.. అందులో తప్పేముంది’ అని అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. దిల్లీలో మొహల్లా క్లినిక్‌, పాలీ క్లినిక్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు వంటి మూడు రకాల వైద్య కేంద్రాలను అందుబాటులో ఉన్నాయన్నారు. ఇటువంటి మార్పునే దేశవ్యాప్తంగా కోరుకుంటున్నామని అందుకోసం కృషి చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని