Brij Bhushan: బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆధారాల్లేవా..? పోలీసులు ఏం చెప్పారంటే..?

Wrestlers Protest: రెజ్లర్లు చేస్తోన్న ఆందోళనలో ఇటీవల పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ సమయంలో దిల్లీ పోలీసు వర్గాలు కీలక విషయం వెల్లడించాయి. 

Updated : 31 May 2023 20:01 IST

దిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ (Brij Bhushan Sharan Singh)పై చర్యలు తీసుకోవాలని, ఆయన్ను అరెస్టు చేయాలని కొద్దికాలంగా రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలు లభించలేదని దిల్లీ పోలీసు విభాగం ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. కానీ, ఆ వెంటనే దిల్లీ పోలీసులు ఓ ట్వీట్‌ చేసి డిలీట్‌ చేయడం చర్చకు దారితీసింది.(Wrestlers Protest)

‘ఇప్పటివరకు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ను అరెస్టు చేసేందుకు తగిన ఆధారాలు లభించలేదు. మరో 15 రోజుల్లో ఛార్జ్‌షీట్‌ లేక తుది నివేదిక రూపంలో మేం కోర్టులో దర్యాప్తు వివరాలు సమర్పిస్తాం. అయితే రెజ్లర్ల ఆరోపణలను సమర్థించే అనుబంధ సాక్ష్యాలు లభ్యం కాలేదు. ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచిన పోక్సో సెక్షన్ల కింద ఏడు సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉంటుంది. అందుకే దర్యాప్తు అధికారి సదరు నిందితుడిని అరెస్టు చేయలేరు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటోన్న వ్యక్తి సాక్ష్యాలను ప్రభావితం చేయడం లేదు’ అని దిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఉన్నతస్థాయి వర్గాలు చెప్పినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే దీనిపై దిల్లీ పోలీసు విభాగం చేసిన ఓ ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది.

‘రెజ్లర్లు పెట్టిన కేసులో పోలీసులు తుది నివేదికను సమర్పిస్తారంటూ కొన్ని సోషల్‌ మీడియా ఛానల్స్‌ ప్రసారం చేశాయి. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే తగిన నివేదిక సమర్పిస్తాం’ అని ఈ మధ్యాహ్నం ట్వీట్ చేసిన దిల్లీ పోలీసు విభాగం.. కొద్ది సేపటికే దాన్ని తొలగించింది. దీంతో బ్రిజ్‌ భూషణ్‌ కేసు వ్యవహారం గందరగోళానికి దారితీసింది.

స్పందించిన బ్రిజ్‌ భూషణ్..

ఇదిలా ఉండగా.. దిల్లీ పోలీసు వర్గాల కథనాల నేపథ్యంలో బ్రిజ్‌ భూషణ్ స్పందించారు. ‘‘నాపై వచ్చిన ఒక్క ఆరోపణ నిజమని తేలినా.. నేను ఉరేసుకుంటా. మీ(రెజ్లర్ల) దగ్గర ఏవైనా ఆధారాలుంటే.. వెంటనే కోర్టుకు సమర్పించండి. అప్పుడు నేను ఎలాంటి శిక్షకైనా సిద్ధమే’’ అని ఆయన సవాల్‌ చేశారు.

రెజ్లర్లు చేస్తోన్న నిరసన ఇటీవల తీవ్ర రూపం దాల్చింది. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ సమయంలో సమీప ప్రాంతంలో వారు మార్చ్ నిర్వహించడం ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. అలాగే మంగళవారం గంగా నదిలో తమ పతకాలు కలిపేస్తామని వారు ప్రకటించి, తర్వాత వెనక్కి తగ్గడం వంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక రెజ్లర్లకు మద్దతుగా జూన్‌ 1వ తేదీన దేశవ్యాప్త ఆందోళన నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా వెల్లడించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు