Jaishankar: శాంతి నెలకొన్న తర్వాతే చైనాతో సంబంధాలు.. జైశంకర్‌

సరిహద్దులో శాంతి, ప్రశాంతత నెలకొన్నప్పుడే ఇరుదేశాల మధ్య సంబంధాలు బలోపేతానికి మార్గం సుగమమవుతుందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ తెలిపారు.

Published : 08 Jun 2023 23:23 IST

దిల్లీ: చైనాతో (China) సంబంధాలపై విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌ (Jaishankar) మరోసారి స్పందించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత నెలకొన్న తర్వాతే ఇరుదేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం సాధ్యపడుతుందని చెప్పారు. ఈ మేరకు భారత్‌ వైఖరిని డ్రాగన్‌కు సూటిగా వివరించారు. దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జైశంకర్‌ మాట్లాడారు. చైనాతో భారత్‌ సంబంధాలను మెరుగుపరచుకోవాలనుకుంటోందని కానీ, సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడే ఇది సాధ్యపడుతుందన్నారు. అంతవరకు భారత్‌ తరఫున ఎలాంటి ముందడుగు ఉండబోదని తేల్చి చెప్పారు. భారత్‌ వక్రమార్గంలో ఆలోచించడం లేదని చెప్పిన జైశంకర్‌.. భారత్‌-చైనా సరిహద్దు వెంబడి ఉన్న పరిస్థితులే తమ దృక్పథంలో మార్పు తీసుకొస్తున్నాయని చెప్పారు. సరిహద్దులో చైనా చేపడుతున్న రోడ్డు మార్గాలే దిల్లీ ఆలోచనా విధానాన్ని మార్చివేస్తున్నాయని చెప్పారు.

తూర్పు లద్దాఖ్‌లోని కొన్ని కీలక ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు వెనక్కి వెళ్లాలని ఒప్పందం కుదిరినప్పటికీ.. అది కార్యరూపం దాల్చడం లేదన్నారు. ఒప్పందాన్ని గౌరవించి నడుచుకున్నప్పుడే సరిహద్దులో శాంతి నెలకొంటుందని జైశంకర్‌ అన్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోకపోతే ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రభావితమవుతాయన్నారు. ఒకసారి దృక్పథంలో మార్పు వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు కొనసాగుతూనే ఉంటాయని జైశంకర్‌ తెలిపారు.

‘‘ గల్వాన్‌లో ఘర్షణ చోటు చేసుకున్న తర్వాతి రోజునే చైనా విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడాను. ఇప్పటికీ మాట్లాడుతున్నాను. ఒకరు చెప్పిన దాన్ని మరొకరు వింటూ సరైన పరిష్కారమార్గాన్ని కనుక్కోవాలి. అది జరగకపోతే ఇరుదేశాల మధ్య సంబంధాలు ప్రభావితమవుతాయి. తద్వారా సాధారణ పరిస్థితులు నెలకొనడం చాలా కష్టం’’ అని జైశంకర్‌ అన్నారు. 2020కి ముందు ఎల్‌ఓసీ వెంబడి సైనిక బలగాలు ఉండేవి కాదని, గల్వాన్‌ ఘర్షణ తర్వాత ఇరు దేశాలు తమ సైన్యాన్ని మోహరించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని చెప్పారు. అయితే, సరిహద్దు వెంబడి పూర్వపు పరిస్థితులను నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు