IAF: వాళ్లు అప్‌గ్రేడ్‌ అయ్యారు.. మనమూ అవ్వాలి: ఐఏఎఫ్‌ చీఫ్‌

పొరుగు దేశాలు పాకిస్థాన్‌.. చైనా నుంచి భారత్‌కు ముప్పు పొంచే ఉందని భారత వైమానిక దళం చీఫ్‌ వివేక్‌ రామ్‌ చౌధరి వెల్లడించారు. కశ్మీర్‌ అంశాన్ని పాకిస్థాన్‌ వదిలిపెట్టే అవకాశాలు లేవని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు కశ్మీర్‌ వివాదాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని అన్నారు. భారత వ్యూహాత్మక

Updated : 08 Dec 2021 17:13 IST

దిల్లీ: పొరుగు దేశాలు పాకిస్థాన్‌.. చైనా నుంచి భారత్‌కు ముప్పు పొంచే ఉందని భారత వైమానిక దళం చీఫ్‌ వివేక్‌ రామ్‌ చౌధరి వెల్లడించారు. కశ్మీర్‌ అంశాన్ని పాకిస్థాన్‌ వదిలిపెట్టే అవకాశాలు లేవని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు కశ్మీర్‌ వివాదాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని అన్నారు. భారత వ్యూహాత్మక లక్ష్యాలకు చైనా ఎప్పుడూ సవాల్‌గా నిలుస్తోందని తెలిపారు. 

దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చైనా, పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తమ సామర్థ్యాన్ని పెంచుకున్నాయని తెలిపారు. చైనాకి చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఎయిర్‌ ఫోర్స్‌, పాకిస్థాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ వారికి అవసరమైన పరికరాలను, మౌలిక సదుపాయాలను, సాంకేతికతను సమకూర్చుకుంటున్నాయని చెప్పారు. ఆయా దేశాలు రక్షణ వ్యవస్థను అప్‌గ్రేడ్‌ చేసుకుంటున్న నేపథ్యంలో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ను కూడా విస్తరింపజేసి, వీలైనంత తొందరగా ఆధునికీకరించాలని ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ వివేక్‌ రామ్‌ అభిప్రాయపడ్డారు. 

‘మన భద్రతా పరిస్థితులను వివాదాస్పద సరిహద్దులు, అస్థిరమైన పొరుగుదేశాలు ప్రభావితం చేస్తాయి. అందుకే మన వ్యూహాత్మక ప్రాధాన్యతలను మళ్లీ అంచనా వేసుకోవాలి. ఇతర దేశాలకంటే మనం వెనుకబడిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఇదే భవిష్యత్తులో మనకు కీలకం కానుంది. ప్రస్తుతం మేం యుద్ధక్షేత్రంలో రక్షణాత్మక ధోరణిలో పోరాటాన్ని పక్కన పెట్టి.. దూకుడు విధానాన్ని అలవర్చుకుంటున్నాం’’అని వివేక్‌ రామ్‌ అన్నారు. 

యుద్ధానికి సిద్ధంగా ఉండాలి..

చైనా ఆధిపత్య పాలసీలు.. భారత్‌కు ట్రేడింగ్‌, రక్షణ రంగంలో మరిన్ని అవకాశాలు కల్పించేలా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వివేక్‌ రామ్‌ సూచించారు. యుద్ధం గురించి మాట్లాడుతూ ‘భవిష్యత్తులో భారతదేశంపై అన్ని రంగాల నుంచి దాడి జరిగే అవకాశముంది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, దౌత్యపరంగా ఒంటరిని చేయడం, యుద్ధ వాతావరణాన్ని కల్పించడం, సమాచార సరఫరాను నిలిపివేయడం, అందిస్తున్న సేవలను తిరస్కరించడం ఇలా ఏ రూపంలోనైనా దాడి జరగొచ్చు. వీటన్నింటికీ మనం సిద్ధంగా ఉండాలి’’అని ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ వివేక్‌ రామ్‌ చౌధరి చెప్పారు. 

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని