BJP: ‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్‌’.. భాజపా పోస్ట్‌ వైరల్‌

BJP: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ విమానాశ్రయంలో టెంట్‌ కూలిన ఘటనపై భాజపా స్పందిస్తూ కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. దీనికి నెహ్రూను నిందించొద్దంటూ కౌంటర్‌ పోస్ట్‌ చేసింది.

Updated : 29 Jun 2024 17:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారీ వర్షాల కారణంగా దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌-1 పైకప్పులో కొంతభాగం శుక్రవారం కూలిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన 24 గంటల్లోనే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ విమానాశ్రయం (Rajkot Airport)లో పైకప్పుగా ఏర్పాటు చేసిన టెంట్‌ ఊడిపడిపోయింది. దీంతో వరుస ఘటనలను ఉద్దేశిస్తూ కేంద్రంపై కాంగ్రెస్‌ (Congress) విమర్శలు గుప్పించింది. వీటికి భాజపా గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ఈ ఘటనకు నెహ్రూను నిందించొద్దని, ఎందుకంటే ఆయన విమానాశ్రయాలు కట్టించలేకపోయారని ఎద్దేవా చేసింది. అసలేం జరిగిందంటే..

గుజరాత్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లో నీరు నిలవకుండా ఉండేందుకు మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో టెర్మినల్‌ వెలుపల ప్రయాణికుల రాకపోకల కోసం ఏర్పాటు చేసిన టెంట్‌ (canopy) కొంతభాగం చిరిగి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో కాంగ్రెస్‌ నేతలు ఈ ఘటనపై స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. ఈ ఎయిర్‌పోర్టును గతేడాదే మోదీ ప్రారంభించారని, అప్పుడే కూలిపోయిందని దుయ్యబట్టారు.

సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. లద్దాఖ్‌లో ఐదుగురు జవాన్ల మృతి

దీనికి భాజపా (BJP) ఐటీ విభాగం చీఫ్‌ అమిత్ మాలవీయ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ ప్రతిపక్ష పార్టీకి దీటుగా బదులిచ్చారు. ‘‘భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్టులోని క్లాత్‌ టెంట్‌ చిరిగిపోయింది. అంతేగానీ.. కట్టడం కూలినట్లు కాదు. ఇక, ఈ ఘటనకు మనం నెహ్రూ (మాజీ ప్రధాని)ను నిందించొద్దు. ఎందుకంటే ఆయన ప్రజలకు అవసరమైన స్థాయిలో విమానాశ్రయాలను నిర్మించలేదు. ఆయన హయాంలో మనమంతా డీఆర్‌డీవో ధ్రువీకరించిన ఎడ్లబండ్లలో ప్రయాణించాం’’ అని అన్నారు. ఇక, దిల్లీ ఘటన నేపథ్యంలో దేశంలోని అన్ని చిన్నా పెద్ద విమానాశ్రయాల్లో భద్రతాపరమైన తనిఖీలు నిర్వహించాలని పౌరవిమానయాన శాఖ ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు.

దిల్లీ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ కూలిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే స్పందిస్తూ.. ఈ టెర్మినల్‌ను మార్చిలో ప్రధాని మోదీ ప్రారంభించారని ఆరోపించారు. దీన్ని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఖండించారు. ‘‘కూలింది పాత భవనంలోని పైభాగం. దానిని 2009లో నిర్మించారు. ప్రధాని మోదీ ప్రారంభించిన భవనం అవతలివైపు ఉంది’’ అని స్పష్టతనిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని