‘ఎంపీలమని చెప్పినా పోలీసులు మాపై దాడి చేశారు!’

: తాము ఎంపీలమని చెప్పినా కూడా వినకుండా దిల్లీ పోలీసులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కేరళకు చెందిన యునైటెడ్‌ డెమోక్రటిక్‌ .....

Published : 24 Mar 2022 18:43 IST

పార్లమెంట్‌లో లేవనెత్తిన యూడీఎఫ్‌ ఎంపీలు

దిల్లీ: తాము ఎంపీలమని చెప్పినా కూడా వినకుండా దిల్లీ పోలీసులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కేరళకు చెందిన యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌) ఎంపీలు ఆరోపించారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తారు. కేరళలో ప్రతిపాదిత సెమీ హై-స్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా నినాదాలు చేసుకుంటూ పార్లమెంట్‌ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలిపారు. అయితే, ఎంపీల ఆరోపణల్ని దిల్లీ పోలీసులు ఖండించారు. ఏ ఎంపీపైనా తాము దాడి చేయలేదని స్పష్టంచేశారు. 

అసలేం జరిగిందంటే?

లోక్‌సభలో ప్రశ్నోత్తరాల అనంతరం ఈ అంశాన్ని కాంగ్రెస్‌ సభ్యుడు కె.సురేశ్‌ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. మహిళా ఎంపీలతో పాటు మొత్తం 12 మంది సభ్యులు ఉదయం 10.45గంటల సమయంలో విజయా చౌక్‌ నుంచి బయల్దేరి పార్లమెంట్‌కు నిరసన ర్యాలీగా వస్తుంటే దిల్లీ పోలీసులు అక్కడికి వచ్చి తమను అడ్డుకున్నారన్నారు. తాము ఎంపీలమని చెబితే.. నినాదాలు చేయడంపై వారు అభ్యంతరం తెలిపారన్నారు. నినాదాలు చేయడం తమ హక్కు అని చెప్పగా.. ఎలాంటి కవ్వింపులకు పాల్పడకపోయినా తమపై దాడి చేశారని ఓం బిర్లాకు వివరించారు. సిల్వర్‌లైన్ ప్రాజెక్ట్ కారిడార్ సరిహద్దు సర్వే, మార్కింగ్‌పై కేరళలోని లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం తీవ్ర నిరసనలు ఎదుర్కొంటోంది. దీంతో ఈ ప్రాజెక్టు రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలోనే గురువారం కేరళ సీఎం పినరయి విజయన్‌ దిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. 

దిల్లీ పోలీసులకున్న అధికారమేంటి?: ఆరెస్పీ ఎంపీ

ఈ ఘటన దురదృష్టకరమని ఆరెస్పీ ఎంపీ ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్‌ పేర్కొన్నారు. ఈ నిరసనల్లో పాల్గొన్నవారంతా ఎంపీలేనని పోలీసులకు బాగా తెలిసినా పార్లమెంట్‌ భవనంలోకి అనుమతించలేదని ఆరోపించారు. ఇది తమ ప్రత్యేక హక్కుకు సంబంధించిన ప్రశ్న అన్నారు. పార్లమెంట్‌ ఆవరణలోకి వచ్చాక కూడా తమను అడ్డుకున్నారన్నారు. పార్లమెంటులో ప్రవేశించకుండా ఎంపీలను బలవంతంగా నియంత్రించేందుకు దిల్లీ పోలీసులకు ఉన్న అధికారమేంటని ప్రశ్నించారు. సభ్యులు చెప్పిన విషయాల్ని ఆలకించిన స్పీకర్‌ ఓం బిర్లా ఈ అంశంపై సంబంధిత అధికారులతో మాట్లాడతానన్నారు. ఈ ఘటనపై లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వాలని యూడీఎఫ్‌ ఎంపీలకు సూచించారు. 

రాజ్యసభలోనూ లేవనెత్తారు!

మరోవైపు, ఈ అంశాన్ని కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ రాజ్యసభలో లేవనెత్తారు. ఎంపీలు తమ శాంతియుత నిరసన తర్వాత పార్లమెంట్‌కు వస్తుంటే దిల్లీ పోలీసులు అడ్డుకొని, అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. దీనిపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ ఎంపీకు సూచించారు. హోంమంత్రిత్వశాఖతో మాట్లాడి విషయం తెలుసుకుంటానన్నారు.

పోలీసుల వివరణ ఇదీ..

ఈ ఘటనపై దిల్లీ పోలీసుల పౌర సంబంధాల అధికారి సుమన్‌ నాల్వా మాట్లాడారు. ‘‘కొంతమంది వ్యక్తులు మలయాళంలో నినాదాలు చేస్తూ మీడియా లాన్ నుంచి నార్త్ ఫౌంటెన్ బారికేడ్ పాయింట్ వద్దకు వచ్చారు. బారికేడ్ల వద్ద సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అయితే, తాము ఎంపీలమంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఐడీలను చూపించాలని అడగ్గా తిరస్కరించారు. దీంతో వారిని గుర్తించేందుకు వీలుగా పార్లమెంట్‌లోని గేట్‌ నంబర్‌ 1 వద్ద సెక్యూరిటీ పికెట్‌ నుంచి సిబ్బందిని పిలిపించారు. వాళ్లు వచ్చి ఎంపీలను గుర్తించగా.. లోపలికి అనుమతించాం. ఏ ఎంపీపైనా దౌర్జన్యం చేయలేదు. బారికేడ్‌ల వద్ద ఉన్న సిబ్బంది వారిని అడ్డుకొనేందుకు మాత్రమే  ప్రయత్నించారు. ఎంపీలు తమ గుర్తింపును పేర్కొనకుండా నినాదాలు చేస్తూ ముందుకు వస్తుండటంతో పోలీసులు అడ్డుకున్నారు’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని