MiG 21: 2025 నాటికి మిగ్‌-21 యుద్ధ విమానాల సేవలు నిలిపేస్తాం: ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌

అక్టోబరు 8వ తేదీన ప్రయాగ్‌రాజ్‌లో (Prayagraj) వైమానిక దళ (IAF) దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్ వీఆర్‌ చౌధరి (VR Chaudhari) దిల్లీలో మీడియాతో మాట్లాడారు.

Published : 03 Oct 2023 22:51 IST

దిల్లీ: 2025 నాటికి భారత వైమానిక దళంలో (IAF) మిగ్‌-21 (MiG-21) యుద్ధ విమానాల సేవలు నిలిపివేస్తామని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్ వీఆర్‌ చౌధరి (VR Chaudhari) తెలిపారు. పాతబడిపోయిన ఈ రష్యన్ విమానాల సంఖ్యను తేజస్‌ ‘ఎల్‌సీఏ మార్క్‌ 1ఎ’ (LCA Mark 1A) విమానాలతో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. అక్టోబరు 8న ప్రయాగ్‌రాజ్‌లో వైమానిక దళ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘83 ఎల్‌సీఏ మార్క్‌-1ఎ యుద్ధ విమానాల కోసం ఒప్పందం జరిగింది. మరో 97 అదనపు విమానాల కోసం ఒప్పందం జరగాల్సి ఉంది. దాంతో మొత్తం ఎల్‌సీఏ మార్క్‌-1ఎల సంఖ్య 180కి చేరుకుంటుంది’ అని ఆయన చెప్పారు.

మిగ్‌ 21ల సేవలను 2025 కల్లా నిలిపివేస్తామని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్ వీఆర్‌ చౌధరి వెల్లడించారు. మిగ్ 21 స్క్వాడ్రన్‌ల స్థానంలో తేజస్‌లు వస్తాయన్నారు. ఈ ప్రతిపాదన అమలులో ఉందని చెప్పారు. మరో నెల రోజుల్లో రెండో స్క్వాడ్రన్‌ నంబర్‌ ప్లేటెడ్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. వచ్చే ఏడాది మూడో స్క్వాడ్రన్‌ ప్రక్రియ ఉంటుందన్నారు. ఇలా వచ్చే ఎల్‌సీఏ మార్క్‌-1ఎలతో మిగ్‌-21 ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. మిగ్‌-21లు 60ఏళ్లకు పైగా భారత వైమానిక దళంలో సేవలందించాయి.అయితే, కొన్నేళ్లుగా అవి తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. 

సరిహద్దులో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని వీఆర్‌ చౌధరి తెలిపారు. ముఖ్యంగా తూర్పు లద్ధాఖ్‌పై దృష్టి కేంద్రీకరించామన్నారు. అక్టోబరు 8న భారత వైమానిక దళం 91వ వార్షికోత్సవం జరగనుందని చెప్పారు. ‘సరిహద్దులు దాటిన ఐఏఎఫ్‌ వైమానిక శక్తి’ థీమ్‌ను అందుకోసం ఎంచుకున్నామని ఆయన వివరించారు. కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పుతూ ఈ ఏడాది ఐఏఎఫ్‌ ప్రదర్శన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంగమ ప్రదేశంలోని సుందర పరిసరాల్లో ఐఏఎఫ్‌ బలం, వైమానిక దళ ఆస్తుల వైవిధ్యాన్ని ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. ఇందులో టైగర్‌మోత్‌, హార్వర్డ్ వంటి విమానాలు మొదలుకొని ఇటీవల ప్రవేశపెట్టిన సీ-295 దాకా దాదాపు 120 విమానాలు ప్రదర్శనల్లో పాల్గొంటాయని వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని