ట్రంప్‌నకు ఆ విషయాలు చెప్పబోం!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు దేశ భద్రతకు సంబంధించిన రహస్య విషయాలు చెప్పబోమని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయానికి స్వస్తి పలకనున్నట్లు తెలిపారు.......

Published : 06 Feb 2021 09:27 IST

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు దేశ భద్రతకు సంబంధించిన రహస్య విషయాలు చెప్పబోమని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయానికి స్వస్తి పలకనున్నట్లు తెలిపారు. ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఆయనకు రహస్య విషయాలు చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. కీలక సమాచారం చెప్పడం వల్ల ఏం లాభం? ఎక్కడైనా నోరుజారి ఏదో వాగడం తప్ప ఆయన వల్ల ఏమైనా ప్రభావం ఉంటుందా?’’ అని బైడెన్ వ్యాఖ్యానించారు.

మాజీ అధ్యక్షులకు దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని అందజేయడం అమెరికాలో ఆనవాయితీగా వస్తోంది. ఇది వారికిచ్చే గౌరవంగా భావిస్తుంటారు. అలాగే వారి అనుభవం భవిష్యత్తులో ఉపయోగపడొచ్చని అలా చేస్తుంటారు. అయితే, ఇది అధికారంలో ఉన్న అధ్యక్షులకు సమ్మతమైతేనే జరుగుతుంది. కానీ, ట్రంప్‌నకు తెలియజేయడం వల్ల ఉపయోగమేమీ ఉండకపోగా.. ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమేనని బైడెన్ భావిస్తున్నారు. గతంలో ట్రంప్‌ హయాంలో పనిచేసిన ఉన్నతాధికారులు సైతం బైడెన్‌కు ఇదే సూచించారు. మాజీ అధ్యక్షులను ప్రత్యర్థి దేశాలు లక్ష్యంగా చేసుకొని కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంటుందని ట్రంప్‌ హయాంలో జాతీయ భద్రతా విభాగానికి ప్రిన్సిపల్‌ డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరించిన గోర్డన్‌ అభిప్రాయపడ్డారు. ఇక ట్రంప్‌ విషయంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువనని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. అలాగే అమెరికా ప్రత్యర్థి దేశాల్లోనూ ట్రంప్‌నకు వ్యాపారాలు ఉన్నాయని.. వాటి నుంచి లబ్ధి పొందేందుకు ఆయన సమాచారాన్ని లీక్‌ చేయొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి...

ప్రస్తుతానికి లాటరీ విధానమే

అమెరికాలో దుండగుడి కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని