China: ప్రజాస్వామ్య సదస్సు.. అమెరికాపై చైనా తీవ్ర వ్యాఖ్యలు!

ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి పిలుపునిస్తూ అమెరికా తాజాగా నిర్వహించిన ‘ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సు’పై చైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అమెరికా ప్రజాస్వామ్య భావనను ‘సామూహిక విధ్వంస ఆయుధం’గా అభివర్ణించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రచ్ఛన్న...

Published : 12 Dec 2021 01:19 IST

బీజింగ్: ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి పిలుపునిస్తూ అమెరికా తాజాగా నిర్వహించిన ‘ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సు’పై చైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అమెరికా ప్రజాస్వామ్య భావనను ‘సామూహిక విధ్వంస ఆయుధం’గా అభివర్ణించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి సైద్ధాంతిక విభజనలను ప్రేరేపించారని ఆరోపించింది. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు అగ్రరాజ్యం చాలా కాలంగా ‘ప్రజాస్వామ్యం’ అనే భావనను వినియోగిస్తోందని.. ఇది 'సామూహిక విధ్వంసక ఆయుధం’గా మారిందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అన్నారు.

పక్షపాతం, ప్రజాస్వామ్య ఆయుధీకరణ, విభజన, ఘర్షణపూరిత వాతావరణాన్ని సృష్టించేందుకే ఈ సదస్సును నిర్వహించినట్లు విమర్శించారు. ఈ సమ్మిట్‌ నుంచి రష్యా, హంగేరీ, చైనా తదితర దేశాలను తప్పించిన విషయం తెలిసిందే. వాణిజ్యం, సాంకేతికత, మానవ హక్కులు, జిన్‌జియాంగ్, తైవాన్ వంటి సమస్యలపై ఇటీవలి కాలంలో ఈ రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

అమెరికా ఆంక్షల కొరడా..

జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఇద్దరు ఉన్నత స్థాయి చైనా అధికారులపై అమెరికా ట్రెజరీ శుక్రవారం ఆంక్షలు విధించింది. వీఘర్లను లక్ష్యంగా చేసుకున్న చైనా ఏఐ నిఘా సంస్థ ‘సెన్స్‌టైం’నూ బ్లాక్‌లిస్ట్‌లో ఉంచింది. దీంతోపాటు మయన్మార్, ఉత్తర కొరియా, బంగ్లాదేశ్‌కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు, సంస్థలపైనా కొరడా ఝులిపించింది. కెనడా, బ్రిటన్‌ సైతం మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి మయన్మార్‌పై ఆంక్షలు విధించాయి. ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సు అనంతరం, మానవ హక్కుల దినోత్సవం రోజే ఈ ప్రకటనలు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని