Penthouse: దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌస్‌.. ధరెంతో తెలుసా?

ముంబయి (Mumbai) నగరంలోని ఓ పెంట్‌హౌస్‌ (Penthouse) దేశంలోనే అత్యంత ఖరీదైన ధరకు అమ్ముడైంది. ఇప్పటి వరకు దేశంలో జరిగిన అపార్ట్‌మెంట్‌ (Apartment) సింగిల్‌ డీల్స్‌లో ఇదే ఖరీదైన డీల్‌ అని రియల్‌ ఎస్టేట్‌ (Real Estate) వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Published : 13 Feb 2023 01:24 IST

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని (Business Capital) ముంబయి (Mumbai)కి భారత్‌లో అత్యంత ఖరీదైన నగరంగా పేరుంది. మరి, ఇక్కడ అన్ని సౌకర్యాలతో ఇల్లు కొనుగోలు చేయాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే. సాధారణ అపార్ట్‌మెంట్‌ (Apartment) ధర రూ. కోటి వరకు ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఇక, లగ్జరీ అపార్ట్‌మెంట్ అయితే చెప్పక్కర్లేదు రూ. కోటి పై మాటే. తాజాగా, ముంబయిలో ఓ అపార్ట్‌మెంట్‌లోని పెంట్‌హౌస్‌ (Penthouse) కళ్లు చెదిరే ధరకు అమ్ముడైంది. ఎంత ఓ రూ. 50 కోట్లు లేదా రూ. వంద కోట్లు అనుకుంటున్నారేమో.. అదేంకాదు అక్షరాలా రూ. 230 కోట్లు. పెంట్ హౌస్‌కు అంత ధర ఎందుకు..? అని ఆశ్చర్యపోకండి. ఇప్పటి వరకు భారత్‌లో జరిగిన సింగిల్ అపార్ట్‌మెంట్‌ డీల్స్‌లో ఇదే అత్యంత ఖరీదైన డీల్‌గా రియల్‌ ఎస్టేట్‌ (Real Estate) వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2023లో ముంబైలో జరిగిన రెండో అతిపెద్ద డీల్‌ కూడా ఇదేనని చెబుతున్నారు. 

ముంబయిలోని వర్లీ (Worli) ప్రాంతంలోని డాక్టర్‌ అనిబిసెంట్‌ రోడ్‌లో ఒబెరాయ్‌ రియల్టీ సంస్థ, సహానా గ్రూప్‌ అనే మరో రియల్‌ఎస్టేట్‌ సంస్థతో కలిసి 360 వెస్ట్‌ అనే పేరుతో లగ్జరీ అపార్ట్‌మెంట్లను నిర్మిస్తోంది. ఇందులో టవర్‌ బీలో 63వ అంతస్థులో 29,885 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ లగ్జరీ పెంట్‌ హౌస్‌ను నిర్మించింది. ఈ ట్రిపుల్‌ బెడ్‌ రూమ్‌ పెంట్‌ హౌస్‌ను వెల్స్పన్ గ్రూప్ (Welspun Group) ఛైర్మన్ బికె గోయెంకా (BK Goenka) రూ. 230.55 కోట్లకు కొనుగోలు చేశారు. కొద్ది రోజుల క్రితం ఇదే అపార్ట్‌మెంట్‌లో డీమార్ట్‌ (Dmart) అధిపతి రాధాకిషన్ దమానీ (Radhakishan Damani) కుటుంబం  రూ. 1,238 కోట్లతో 28 ఫ్లాట్లను కొనుగోలు చేసింది. ముంబయి నగరంలో ఖరీదైన ప్రాంతం, బీచ్‌ వ్యూ వంటి కారణాలతో ఇక్కడ అపార్ట్‌మెంట్‌లు ఇంత ఖరీదు పలుకుతున్నాయని రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని