Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం

రానున్న రోజుల్లోనూ మీడియా నిష్పాక్షికంగా పనిచేసి ప్రజలకు న్యాయం అందేలా చూడాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. దేశాభివృద్ధి కోసం అనుక్షణం పాటుపడే మీడియా మిత్రులను ఆమె ప్రశంసించారు. 

Published : 05 Jul 2022 02:22 IST

‘ఇండియా టుడే క్లాన్‌కేవ్‌ ఈస్ట్‌-2022’లో పాలొన్న దీదీ

దిల్లీ: రానున్న రోజుల్లోనూ మీడియా నిష్పాక్షికంగా పనిచేసి ప్రజలకు న్యాయం అందేలా చూడాలని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. దేశాభివృద్ధి కోసం అనుక్షణం పాటుపడే మీడియా మిత్రులను ఆమె ప్రశంసించారు. ‘ఇండియా టుడే క్లాన్‌కేవ్‌ ఈస్ట్‌-2022’ కార్యక్రమంలో ఆమె సోమవారం పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా భాజపాపై ఆమె పలు విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం, భాజపా నుంచి సస్పెండ్‌ అయిన నుపుర్‌ శర్మ, హోంమంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా బీసీసీఐ ప్రధాన కార్యదర్శి కావడం గురించి ఆమె ఈ కార్యక్రమంలో చర్చించారు. 2024లో జరిగే ఎన్నికలు పాలకులను ఎన్నుకొనేందుకు కాకుండా భాజపాను తిరస్కరించేందుకు జరుగుతాయన్నారు. ‘‘దేశ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో భాజపాను బుల్డోజ్ చేస్తారు. ఎన్నుకునేందుకు కాదు.. భాజపాకు వ్యతిరేకంగా పార్టీ నేతలని తిరస్కరించేందుకే ప్రజలు ఓటు వేస్తారు’’ అని దీదీ అభిప్రాయపడ్డారు.

మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం

మహారాష్ట్రలో (Maharashtra) ఏర్పడిన కొత్త అధికార కూటమి ఆరు నెలల్లో కూలిపోతుందని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) చేసిన వ్యాఖ్యల తరహాలోనే బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్‌ శిందే-దేవేంద్ర ఫడణవీస్‌ సారథ్యంలోని కూటమి త్వరలోనే పడిపోతుందని జోస్యం చెప్పారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందని నేను భావించడంలేదు. ఇది అనైతిక, అప్రజాస్వామిక సర్కారు. వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుండవచ్చు, కానీ ప్రజల హృదయాలను గెలవలేరు’ అని పేర్కొన్నారు.

‘మీరు మీ అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణచివేయవచ్చు, కానీ ఈ దేశ ప్రజలు ప్రజాస్వామ్య మార్గాలను ఉపయోగించి మిమ్మల్ని కిందకు దింపుతారు’ అని ఆమె అన్నారు. భాజపా తరచూ ఖండిస్తూ వస్తున్న వారసత్వ రాజకీయాలపైనా దీదీ స్పందించారు. ‘భాజపా దేన్ని వారసత్వ రాజకీయం అంటోంది? బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ మరణం తర్వాత ఆయన కుమార్తె షేక్‌ హసీనా ఆ బాధ్యతలు చేపట్టారు. ఆమె కాకుండా ఇంకెవరు ఆ స్థానాన్ని భర్తీ చేసేవారు?’ అని ప్రశ్నించారు.

రాజకీయాల్లో తన మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ప్రస్థానంపైనా మమత మాట్లాడారు. ‘అతడు రాజకీయాల్లో ఉండటం వల్ల ఎవరికైనా ప్రమాదం ఉందా? ప్రజలు రెండుసార్లు అతడ్ని ఎన్నుకున్నారు. యువత దేశ బాధ్యతలను చేపట్టాలని మీకు లేదా?’ అని అన్నారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలంటున్న భాజపా.. మరెందుకు హోంమంత్రి అమిత్‌ షా కుమారుడు జై షాకు బీసీసీఐలో అత్యున్నత పదవి కట్టబెట్టిందని విమర్శలు గుప్పించారు. ఈ వారసత్వ పదవి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారని, అయితే అవి భాజపాకు వ్యతిరేకంగా వేస్తారని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో దీదీ పాట కూడా పాడారు. తొలుత పాడటానికి సంకోచించిన ఆమె.. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చిన ‘ఏ మేరే వతన్‌ కే లోగో’ అనే ప్రసిద్ధ పాటను ఆలపించి అందర్నీ ఆకట్టుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని