Agnipath: మేము సైతం.. అగ్నివీరులకు కార్పొరేట్‌ దిగ్గజాల అభయహస్తం

‘అగ్నిపథ్‌’ పథకంలో శిక్షణ పొందిన అగ్నివీరులకు తమ సంస్థల్లో పనిచేసే అవకాశం కల్పిస్తామని ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు.........

Published : 20 Jun 2022 18:53 IST

మహీంద్రా బాటలోనే హర్ష గోయెంకా, కిరణ్‌ మజుందార్‌ తదితరులు

ఇంటర్నెట్‌డెస్క్‌: సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ (Agnipath) పథకంలో శిక్షణ పొందిన అగ్నివీరులకు (Agniveers) తమ సంస్థలో పనిచేసే అవకాశం కల్పిస్తామని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ఆఫర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మహీంద్రా బాటలోనే మరికొందరు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. తమ సంస్థల్లో ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. హర్ష గోయెంకా (Harsh Goenka), కిరణ్‌ మజుందార్‌ షా (Kiran Mazumdar-Shaw) మహీంద్రా జాబితాలో చేరారు. అపోలో హాస్పిటల్‌ గ్రూప్‌ సైతం ముందుకొచ్చింది.

అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా జరుగుతోన్న హింసాత్మక ఆందోళనలపై ఆనంద్‌ మహీంద్రా సోమవారం ఉదయం ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అగ్నివీరులకు ఓ ఆఫర్‌ ప్రకటించారు. ‘అగ్నిపథ్‌ పథకంపై జరుగుతోన్న హింసాత్మక ఆందోళనలు విచారకరం. గతేడాది ఈ పథకం గురించి తెలిసినప్పుడు నేను ఒక్కటే చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నా. ఈ పథకంతో అగ్నివీరులు పొందే క్రమశిక్షణ, నైపుణ్యాలు వారికి మంచి ఉపాధి లభించేలా చేస్తాయి. అలాంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువకులను రిక్రూట్‌ చేసుకునే అవకాశాన్ని మహీంద్రా గ్రూప్‌ స్వాగతిస్తోంది’ అని మహీంద్రా ట్విటర్‌లో వెల్లడించారు.

కాగా మహీంద్రా ట్వీట్‌ను హర్ష గోయెంకా రీట్వీట్‌ చేస్తూ అగ్నివీరులకు తమ సంస్థలో ఉద్యోగం కల్పిస్తామని వెల్లడించారు. ‘ఆర్‌పీజీ గ్రూపు (RPG group) సైతం అగ్నివీరులకు స్వాగతం పలుకుంది. ఇతర కార్పొరేట్‌ సంస్థలు సైతం ఈ ప్రతిజ్ఞను చేస్తాయని, యువత భవిష్యత్తుపై భరోసా ఇచ్చేందుకు ముందుకొస్తాయని ఆశిస్తున్నా’ అంటూ గోయెంకా ట్వీట్‌ చేశారు. ‘ఇండస్ట్రియల్ జాబ్ మార్కెట్‌ రిక్రూట్‌మెంట్‌లో అగ్నివీర్‌లకు ప్రత్యేక ప్రయోజనం ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నా’ అని కిరణ్‌ మజుందార్‌ పేర్కొన్నారు.

అపోలో హాస్పిటల్స్ (Apollo Hospitals) గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి (Sangita Reddy) ట్వీట్‌ చేస్తూ.. ‘అగ్నివీరులు పొందే క్రమశిక్షణ, నైపుణ్యాలు మార్కెట్‌, పరిశ్రమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని గట్టిగా నమ్ముతున్నా. అలాంటి సామర్థ్యం ఉన్న యువతకు ఉద్యోగం కల్పించేందుకు మా సంస్థ సిద్ధంగా ఉంటుంది’ అని వెల్లడించారు. టీవీఎస్‌ మోటార్‌ (TVS Motor) సంస్థ సైతం భరోసా కల్పించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు శుక్రవారం మాట్లాడుతూ ‘అగ్నిపథ్‌’ పథకం సమాజంపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతుందని, దేశ నిర్మాణానికి గొప్పగా దోహదపడుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆర్థిక వృద్ధిని మెరుగుపరచడంలో, సమాజాన్ని బలోపేతం చేయడంలో అగ్నివీరులు కీలక పాత్ర పోషిస్తారని వేణు ఒక ప్రకటనలో తెలిపారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని