Supreme Court: ఇందులో హక్కుల ఉల్లంఘనేముంది?: ఫైజల్‌ ‘అనర్హత’ పిటిషన్‌పై సుప్రీం

లోక్‌సభ సభ్యత్వా్న్ని రద్దు చేయడంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఏముందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అనర్హత వేటుకు వ్యతిరేకంగా లక్షద్వీప్‌ మాజీ ఎంపీ ఫైజల్‌ (Mohammed Faizal)వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Published : 28 Mar 2023 16:35 IST

దిల్లీ: తనపై అనర్హత (Disqualification) వేటును లోక్‌సభ సెక్రటేరియట్‌ తొలగించకపోవడంపై లక్షద్వీప్‌ మాజీ ఎంపీ, ఎన్‌సీపీ నేత మహ్మద్‌ ఫైజల్‌ (Mohammed Faizal) దాఖలు చేసిన పిటిషన్‌.. మంగళవారం సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం ముందుకొచ్చింది. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన జస్టిస్‌ కె.ఎం. జోసఫ్‌, జస్టిస్‌ బి.వి. నాగరత్నతో కూడిన ధర్మాసనం.. ఇందులో ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేముందని ప్రశ్నించింది. పిటిషనర్‌ హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని అడిగింది.

ఓ హత్యాయత్నం కేసులో ఫైజల్‌ (Mohammed Faizal)కు 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ దిగువ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఆయనను అనర్హుడిగా ప్రకటించింది. దీనిపై ఫైజల్‌ సుప్రీంకోర్టు (SC)ను ఆశ్రయించారు. జైలు శిక్ష తీర్పుపై కేరళ హైకోర్టు స్టే విధించినప్పటికీ తన సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్‌ పునరుద్ధరించలేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

ఈ క్రమంలోనే ఫైజల్‌ (Mohammed Faizal) పిటిషన్‌ నేడు ధర్మాసనం ముందుకు రాగా.. కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ‘‘ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితేనే ఆర్టికల్ 32 కింద వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఈ కేసులో ఏ ప్రాథమిక హక్కు ఉల్లంఘనకు గురైంది?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ఫైజల్‌ తరఫు న్యాయవాది బదులిస్తూ.. ‘తన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే హక్కును తీసేసుకున్నారు’ అని సమాధానమిచ్చారు. దీంతో కోర్టు స్పందిస్తూ.. ‘అది ప్రాథమిక హక్కు ఉల్లంఘన అవుతుందా?’ అని మరో ప్రశ్న వేసింది. అయితే, జైలు శిక్షపై స్టే విధించినా.. అనర్హతను ఎత్తివేసేందుకు నిరాకరించడం ఏకపక్ష నిర్ణయమని, దీనిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని ఫైజల్‌ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.

ఇక, ఈ పిటిషన్‌పై ముందు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ధర్మాసనం ప్రశ్నించగా.. ‘‘జైలు శిక్షపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్‌ చేస్తూ లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేషన్‌ వేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో ఉన్నందున.. నేరుగా ఇక్కడికే వచ్చాం’’ అని ఫైజల్‌ తరఫు న్యాయవాది బదులిచ్చారు. ఈ వివరణ అనంతరం.. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపడుతామని ధర్మాసనం వెల్లడించింది.

కాగా..  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వ అనర్హతపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతున్న తరుణంలో అలాంటి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై సుప్రీంకోర్టు వెలువరించే తీర్పు.. రాహుల్‌గాంధీ కేసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న చర్చ సాగుతోంది. పరువు నష్టం కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడటంతో అతడిపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే జైలుశిక్షపై రాహుల్‌ ఇంకా పై కోర్టుల్లో అప్పీల్‌ చేసుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని