Rave party: అదను చూసి.. దాడి చేసి..!

ముంబయి తీరంలోని కార్డెలియా కూయిజ్‌ ఎంప్రెస్‌ నౌకపై శనివారం రాత్రి మాదకద్రవ్యాల నిరోధ శాఖ హఠాత్తుగా దాడి చేయడం దేశంలో సంచలనం సృష్టించింది. ఈ నౌకలో రేవ్‌ పార్టీ జరుగుతున్న సమయంలో అధికారులు అక్కడి వారిని అదుపులోకి తీసుకొన్నారు.

Updated : 04 Oct 2021 01:52 IST

 హైప్రొఫైల్‌ రేవ్‌పార్టీపై ఎన్‌సీబీ రైడ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ముంబయి తీరంలోని కార్డెలియా క్రూయిజ్‌ ఎంప్రెస్‌ నౌకపై శనివారం రాత్రి మాదకద్రవ్యాల నిరోధక శాఖ హఠాత్తుగా దాడి చేయడం దేశంలో సంచలనం సృష్టించింది. ఈ నౌకలో రేవ్‌ పార్టీ జరుగుతోన్న సమయంలో అధికారులు అక్కడి వారిని అదుపులోకి తీసుకొన్నారు. ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్న వారిలో బాలీవుడ్‌లోని ఓ సూపర్‌ స్టార్‌ కుమారుడు కూడా ఉన్నాడు. వీరి వద్ద నుంచి కొకైన్‌, గంజాయి, ఎండీఎంఏ వంటి మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకొన్నారు.

మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు ఎన్‌సీబీ ముంబయి డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే వెల్లడించారని ఆంగ్లవార్త సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది. ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకొన్న వారిలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌తోపాటు అర్బాజ్‌ మర్చంట్‌, దమేచాను, నుపుర్‌ సారికా, ఇస్మీత్‌ సింగ్‌, మోహక్‌ జైస్వాల్‌, విక్రాంత్‌ ఛోకేర్‌, గోమిత్‌ చోప్రా ఉన్నారు. ప్రస్తుతం అధికారుల అదుపులో ఉన్న వారిని, అక్కడి సామగ్రిని ముంబయికి  తరలించారు.

సంగీత హోరులో రెండు రోజుల సముద్ర ప్రయాణం..

ఈ పార్టీని దిల్లీకి చెందిన నమస్క్రే ఎక్స్‌పీరియన్స్‌, ఫ్యాషన్‌ టీవీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఈ పార్టీ జరగాల్సి ఉంది. కేవలం 100 టికెట్లను మాత్రమే విక్రయానికి ఉంచారు. మిగిలినవి నిర్వాహకులు నేరుగా విక్రయించారు. ఈ పార్టీకి సంపన్నులు ఎగబడ్డట్లు తెలుస్తోంది. దీంతో టికెట్లు కొనుగోలు చేసిన చాలా మంది నౌకను ఎక్కలేకపోయారు. షిప్‌ నిండిపోయిందని కారణం చెప్పి.. రూ.82 వేలు చెల్లించిన ఓ మహిళను నిర్వాహకులు ఎక్కించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

ప్రయాణికుల వలే ఎన్‌సీబీ అధికారులు..

సాధారణ ప్రయాణికులవలే మాదకద్రవ్యాల నిరోధకశాఖ అధికారులు కూడా నౌకలోకి ఎక్కారు. నౌక ముంబయి తీరాన్ని వదిలి సముద్రం మధ్యలోకి చేరగానే పార్టీ మొదలైంది. దీంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమై పలువురిని అదుపులోకి తీసుకొన్నారు. ఇప్పటి వరకు 13 మంది అధికారుల అదుపులో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ, అధికారుల నుంచి ఎటువంటి ధ్రువీకరణ లభించలేదు. నౌక యాజమాన్యానికి కూడా అధికారులు నోటీసులు పంపించినట్లు తెలిసింది. నౌకలోని చాలా గదులను అధికారులు తనిఖీ చేశారు. మరికొన్నింటిని తనిఖీ చేయాల్సి ఉంది.

ఏమిటీ రేవ్‌ పార్టీ సంస్కృతి..!

కచ్చితంగా ఈ రేవ్‌పార్టీ సంస్కృతి ఎక్కడి నుంచి మొదలైందనే దానిపై వివాదం ఉంది. 1950ల చివర్లో వైల్డ్ బొహెమెన్‌ పార్టీలను ‘రేవ్‌’గా పిలిచేవారు. అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ పత్రాల ప్రకారం 1980ల్లో యూరోపియన్‌  టెక్నో మ్యూజిక్‌ లేదా అమెరికన్‌ హౌస్‌ మ్యూజిక్‌లతో జరిగే డ్యాన్స్‌ పార్టీలను రేవ్‌గా పేర్కొన్నారు. 1980ల్లో ఐరోపాలో ఈ రకం పార్టీలు ఎక్కువగా రహస్యంగా గంటల కొద్దీ జరిగేవి. అధికారుల దాడులను నివారించేందుకు ఆహ్వానితులకు పార్టీ రోజు రాత్రి మాత్రమే సమాచారం ఇచ్చేవారు. రోజులు గడిచేకొద్దీ ఈ రేవ్‌పార్టీలను పెద్దల కంటే టీనేజర్ల కోసం ఎక్కువగా నిర్వహించడం మొదలైంది.

తాజాగా రేవ్‌పార్టీల్లో ఎంట్రెన్స్‌ రూపంలోనే భారీగా వసూలు చేస్తున్నారు. వీటిల్లో మాదక ద్రవ్యాలు, లిక్కర్‌ వంటివి అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని వాడి డీహైడ్రెట్‌ అయ్యేవారి కోసం ఖరీదైన మంచినీటి సీసాలు, స్పోర్ట్స్‌ డ్రింకులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ‘చిల్‌రూమ్స్‌’ పేరుతో సెక్స్‌ కార్యకలాపాలకు గదులను సమకూర్చుతున్నారు. భారత్‌లో హిమాచల్‌ ప్రదేశలోని కుల్లూ,గోవా,బెంగళూరు, ముంబయి, పుణే వంటి మెట్రో నగరాల్లో అధికంగా ఇవి జరుగుతుంటాయి.

ఎండీఎంఏ ప్రత్యేకం..

రేవ్‌ పార్టీల్లో ముఖ్యంగా ఎండీఎంఏ అనే సింథటిక్‌ డ్రగ్‌ను వినియోగిస్తారు. అమెరికా నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసిన్‌ ప్రకారం దీనిని ఎక్స్‌, ఎం, ఈ, ఎక్స్‌టీసీ, రోల్స్‌, బీన్స్‌, క్లారిటీ,ఆడమ్‌, లవర్స్‌ స్పీడ్‌ , హగ్‌ డ్రగ్‌ అనే పేర్లతో పిలుస్తారు. 1914లో ఎండీఎంఏను ఆకలిని తగ్గించడానికి తయారు చేశారు. అప్పట్లో అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవడంతో పక్కనపెట్టారు. కానీ, 1970 తర్వాత నుంచి దీని వినియోగం మొదలైంది. రేవ్‌ పార్టీల్లో ఈ ఎండీఎంఏ ప్రభావం పెంచేందుకు మెంథాల్‌ ఇన్‌హీలర్లు, కెమికల్‌ లైట్లు, నియాన్‌ గ్లో స్టిక్స్‌ వంటివి ఏర్పాటు చేస్తారు.

చాలా వరకు మాదకద్రవ్యాలు బ్లాక్‌మార్కెట్‌లో కొనుగోలు చేస్తారు. దీంతో వీటిల్లో కల్తీ కూడా ఎక్కువగా జరుగుతుంటుంది. అంతేకాదు.. మత్తులో చోటు చేసుకొనే వివాదాలు, ప్రమాదాలు కూడా మరణాలకు కారణమవుతున్నాయి. అమెరికాలో ఒక్క 2017లోనే రోజుకు సగటున 192 మంది మరణించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు