Published : 02 Sep 2021 16:34 IST

What Is Haqqani Network: ఇదే తాలిబన్లలోని పాక్‌ ఆత్మ..!

హక్కానీ నెట్‌వర్క్‌తోనే భారత ప్రయోజనాలకు ముప్పు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

తాలిబన్లలో ముల్లా యాకూబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా మహమ్మద్‌ ఒమర్‌ (ఒంటికన్ను ఒమర్‌) కుమారుడు. తాజా అఫ్గాన్‌లో అధికారం పంచుకొనే విషయంలో అతనికి ఓ వర్గం నుంచి బలమైన పోటీ వస్తోంది. అదే హక్కానీ నెట్‌వర్క్‌. వాస్తవానికి ఈ హక్కానీ నెట్‌వర్క్‌ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలో ఉండదు. పాకిస్థాన్‌, తాలిబన్‌ అనుకూల ఉగ్రవాద సంస్థ ఇది. ప్రస్తుతం కాబుల్‌లో దీని హవానే నడుస్తోంది. దీని అధినేత సిరాజుద్దీన్‌ హక్కానీ అధికార పంపిణీ విషయంలో ఇప్పుడు తాలిబన్‌ వ్యవస్థాపకుడి కుమారుడితోనే నేరుగా పోటీ పడుతున్నాడు.   

ఏమిటీ హక్కానీ నెట్‌వర్క్‌..!

హక్కానీ నెట్‌వర్క్‌ను జలాలుద్దీన్‌ హక్కానీ స్థాపించాడు. అతను పష్తూన్‌కు చెందిన ఓ మాజీ ముజాహుద్దీన్‌  కమాండర్‌. సొవియట్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు అతనికి 1980ల్లో సీఐఏ శిక్షణ ఇచ్చింది. ఈ గ్రూప్‌లో పాక్‌లోని వజీరిస్థాన్‌ ప్రాంతంలోని జద్రాన్‌ అనే తెగవారు ఎక్కువగా ఉన్నారు. అత్యధికంగా 10 వేల మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారు.  1996లో తాలిబన్‌ అఫ్గానిస్థాన్‌ను చేజిక్కించుకొంది. అప్పుడు జలాలుద్దీన్‌ హక్కానీ సరిహద్దులు, ఆదివాసీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. తాలిబన్లలో తన పరపతి గణనీయంగా పెంచుకొన్నారు. 9/11 దాడుల తర్వాత అమెరికా అఫ్గాన్‌పై యుద్ధం ప్రకటించింది. ఆ సమయంలో హక్కానీ నెట్‌వర్క్‌ దళాలు నాటో దళాలపై దాడులు చేశాయి. బిన్‌ లాడెన్‌ను అఫ్గాన్‌ నుంచి తరలించడంలో హక్కానీ  నెట్‌వర్క్‌ పాత్ర ఉంది. అమెరికా దాడుల నుంచి తప్పించుకోవడానికి హక్కానీ పాక్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌లో దాక్కొన్నట్లు అమెరికా అనుమానించింది.  

హక్కానీల గుప్పెట్లోకి తాలిబన్లు..

ఓ వైపు అమెరికా దాడులు తీవ్రం కావడంతో తాలిబన్లకు పాక్‌ ఆశ్రయం ఇస్తోంది. ఈ సమయంలో 2013లో ముల్లా మహమ్మద్‌ ఒమర్‌ చనిపోయాడు. ఈ విషయం 2015లో వెలుగులోకి వచ్చింది. సీనియర్‌ హక్కానీ కింగ్‌మేకర్‌గా ఎదిగాడు. ముల్లా అక్తర్‌ మహమ్మద్‌ మన్సూర్‌ను తాలిబన్ల చీఫ్‌గా చేయగా.. తన కుమారుడు సిరాజుద్దీన్‌ హక్కానీని రెండో ర్యాంక్‌కు ప్రమోట్‌ చేశాడు. ఇతను అమెరికా మోస్ట్‌వాంటెడ్‌ జాబితాలో ఉన్నాడు.

అల్‌ఖైదా చీఫ్‌ బిన్‌ లాడెన్‌కు చెందిన కీలక వ్యక్తులతో కలిసి హక్కానీ పనిచేశాడు. ఈ విషయం పాక్‌లో లాడెన్‌ను మట్టుబెట్టిన ఇంట్లో దొరికిన ఫైల్స్‌లో ఉంది. 2018లో జలాలుద్దీన్‌ హక్కానీ మృతిచెందాడు. జలాలుద్దీన్‌ స్థానాన్ని కుమారుడు సిరాజుద్దీన్‌ దక్కించుకొన్నాడు. ప్రస్తుతం సిరాజుద్దీన్‌ అఫ్గాన్‌ తాలిబన్‌లో డిప్యూటీ అమీర్‌ హోదాను అనుభవిస్తున్నాడు. 

 సిరాజ్‌ మేనల్లుడు ఖలీల్‌ హక్కానీని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. అతనిపై కూడా బహుమతి కూడా ఉంది. ప్రస్తుతం కాబుల్‌ రక్షణ బాధ్యతలు అతని చేతిలోనే ఉన్నాయి. తాలిబన్లు, అల్‌ఖైయిదాకు అనుసంధాన కర్తగా కూడా వ్యవహరించాడు. పాకిస్థాన్‌ ఆర్మీకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఇక అఫ్గాన్‌ అధికారులతో జరిగిన చర్చల్లో హక్కానీ కుటుంబం తరపున అనస్‌ హక్కానీ పాల్గొన్నాడు.  

పాక్‌తో సంబంధాలు..

హక్కానీ నెట్‌వర్క్‌ను పాక్‌  ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఐఎస్‌ఐ అనుబంధ సంస్థగానే విశ్లేషకులు చూస్తారు. హక్కానీ నెట్‌ వర్క్‌ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్‌ స్వయంగా పాక్‌లో శరణు పొందాడు. 2012లో పాక్‌లోని వజీరిస్థాన్‌లో జరిగిన అమెరికా చేసిన డ్రోన్‌ దాడిలో జలాలుద్దీన్‌ కుమారుడు బద్రుద్దీన్‌ హక్కానీ మృతి చెందాడు. మరో కుమారుడు నసిరుద్దీన్‌ హక్కానీ కూడా పాక్‌లోని ఇస్లామాబాద్‌ వద్ద హత్యకు గురైయ్యాడు. ఇతను హక్కానీ నెట్‌వర్క్‌లో కీలకమైన వ్యక్తి. సౌదీ, యూఏఈ వంటి దేశాల నుంచి నిధులను సమకూర్చేవాడు. 

భారత్‌పై  విషం కక్కుతూ..

హక్కానీ నెట్‌ వర్క్‌ అవకాశం దొరికినప్పుడల్లా భారత్‌పై విషం కక్కుతుంది. ఇది తాలిబన్లలో భాగమని చెప్పినా.. ఇతర లక్ష్యాలపై కూడా పనిచేస్తుంది. అఫ్గాన్‌లో భారతీయులను లక్ష్యంగా చేసుకొని ఇది దాడులు చేసింది. 2008లో భారత్ దౌత్యకార్యాలయంపై దాడి ఈ గ్రూపు పనే. ఈ ఘటనలో 58 మంది మరణించారు. హెరాత్‌లో జరిగిన ఆత్మాహుతి దాడి కూడా  హక్కానీల పనే. 

అఫ్గాన్‌ మైనారిటీలే లక్ష్యంగా..

అఫ్గాన్‌ మైనారిటీలపై కూడా ఈ గ్రూప్‌ దాడులు చేసింది. 2020లో కాబుల్‌ గురుద్వారాపై ఇదే దాడి చేసింది. ఈ ఘటనలో 25 మంది చనిపోయారు. ఈ దాడికి ఐసిస్‌ కె బాధ్యత స్వీకరించగా.. పలు ఇంటెలిజెన్స్‌సంస్థలు మాత్రం హక్కానీ నెట్‌వర్కే చేయించిందని పేర్కొన్నాయి. హక్కానీ నెట్‌వర్క్‌కు ఐసిస్‌-కె సంస్థకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు, గతంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా చేసిన అమ్రుల్లా సలేహ్‌ తెలిపారు. తాలిబన్లకు కూడా ఐసిస్‌-కెతో మంచి సంబంధాలే ఉన్నాయన్నది ఆయన ఆరోపణ. ‘కాబుల్‌లో కనిపించే ఐసిస్‌-కె ప్రతి మూలం  తాలిబ్స్‌-హక్కానీ నెట్‌వర్క్‌లో ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్