Bipin Rawat: వీవీఐపీల హెలికాప్టర్‌ అదే!

భారత తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు

Updated : 09 Dec 2021 04:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బిపిన్‌ రావత్‌ సహా 13 మంది మృతి చెందారు. భారత రక్షణ దళాల్లో విమానాలు, హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురికావడం ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు ఏకంగా సీడీఎస్‌ ప్రయాణిస్తున్నదే కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలపై వాయుసేన దర్యాప్తు మొదలుపెట్టింది.

ఎంఐ సిరీస్‌లో సురక్షితమైంది..

సీడీఎస్‌ రావత్‌ బృందం ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ను సైనిక రవాణాకు వినియోగించే ఎంఐ-8 హెలికాప్టర్ల నుంచి అభివృద్ధి చేశారు. భారత్‌ మొత్తం 80 హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు రష్యాకు చెందిన రోసోబోర్న్‌ ఎక్స్‌పోర్టుతో 2008లో ఒప్పందం చేసుకొంది. 2013 నాటికి డెలివరీలను పూర్తి చేసింది. మరో 71 హెలికాప్టర్లను వాయుసేన కోసం కొనుగోలు చేసేందుకు సంతకాలు జరిగాయి. చివరిసారిగా 2018లో కొన్ని హెలికాప్టర్లు భారత్‌కు చేరుకొన్నాయి.

ఎంఐ-8 ఎయిర్‌ ఫ్రేమ్‌ పైనే 17వీ5 రకాన్ని నిర్మించారు. ఇది మధ్య శ్రేణి కిందకు వస్తుంది. అత్యాధునిక ఏవియానిక్స్‌ కలిగి ఉండటంతో ఏ వాతావరణంలో అయినా పనిచేయగలదు. అడవులు, సముద్ర జలాలు, ఎడారులపై సురక్షితంగా ప్రయాణించేలా దీనిని నిర్మించారు. ఇది 36 మంది సైనికులను లేదా 4.5 టన్నుల పేలోడ్‌ను తరలించగలదు. పారా కమాండోలను జారవిడిచే సత్తా దీనికి ఉంది. సహాయక చర్యల్లో కూడా దీనిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన దానిని సూలూరు ఎయిర్‌ బేస్‌లో వాడుతున్నారు.  ఇప్పటి వరకు భారీ ప్రమాదాలేవీ ఈ హెలికాప్టర్‌ కారణంగా జరిగిన దాఖలాలు లేవు. బాలాకోట్‌ దాడుల తర్వాత ఘటనల్లో భారత్‌కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థే దీనిని పొరబాటున కాల్చింది. 

ముఖ్యుల కీలక పర్యటనలకు ఇదే..

అత్యంత సురక్షితమైందిగా పేరుండటంతో భారత్‌లోని వీఐపీల పర్యటనలకు దీనినే వినియోగిస్తున్నారు. ప్రస్తుతం భారత ప్రధాని కూడా పర్యటనల కోసం దీనినే వినియోగిస్తున్నారు. ఈ హెలికాప్టర్‌కు ప్రత్యేకమైన రక్షణ కవచాలు అమర్చి ఉంటాయి. ఇంధన ట్యాంక్‌ నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు ఉన్నాయి. సెల్ఫ్‌సీల్డ్‌ ట్యాంక్‌ పేలి మంటలు వ్యాపించకుండా పాలీయూరేథీన్‌ అనే సింథటిక్‌ ఫోమ్‌ రక్షణగా ఉంటుంది. ఇన్ఫ్రారెడ్‌ సప్రెసర్లు, జామర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో 580 కిలోమీటర్లు ప్రయాణించగలదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని