
Mission Olympics: సరిహద్దుల్లోనే కాదు.. ఒలింపిక్స్‌లోనూ భారత్‌ను గెలిపిస్తున్న సైన్యం!
ఇంటర్నెట్ డెస్క్: వందేళ్ల నిరీక్షణకు తెరదించుతూ అథ్లెటిక్స్‌లో స్వర్ణం సాధించిన మన బంగారం నీరజ్ చోప్రా అథ్లెట్ మాత్రమే కాదు.. భారత సైన్యం స్ఫూర్తి కూడా అతడిలో ఉంది. అతడు సైన్యంలో నాలుగో రాజ్‌పుతానా రైఫిల్స్ బృందంలో నాయిబ్ సుబేదార్‌గా పని చేస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో నీరజ్ ప్రతిభను గుర్తించిన భారత ఆర్మీ 2016లో అతడిని జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా నియమించింది. సాధారణంగా క్రీడాకారులను నాన్ కమిషన్డ్ ర్యాంకు ఉద్యోగాలకు తీసుకుంటారు. కానీ నీరజ్‌పై ఎంతో నమ్మకముంచిన సైన్యం అతడికి ఆరంభంలోనే మంచి ఉద్యోగం ఇచ్చింది. సైన్యంలో చేరిన తర్వాత ట్రైనింగ్ సజావుగా సాగడానికి సాయం చేసింది.
ఏంటీ మిషన్ ఒలింపిక్స్..
నీరజ్ లాంటి ఆణిముత్యాల్ని గుర్తించి అంతర్జాతీయ స్థాయి శిక్షణనిచ్చేందుకు సైన్యం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అదే మిషన్ ఒలింపిక్స్. 2001లో ప్రారంభమైన ఈ ప్రోగ్రాం.. నీరజ్ రూపంలో సత్ఫలితాన్ని తెచ్చి పెట్టింది. ఒలింపిక్ పతకాలు సాధించగల సత్తా ఉన్న క్రీడాకారులను గుర్తించి సరైన శిక్షణ అందించడమే ఈ మిషన్ ఒలింపిక్స్ ప్రధాన లక్ష్యం.
ఎలాంటి శిక్షణనిస్తారు?
ఈ మిషన్‌లో భాగంగా అర్హతగల ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తారు. శాస్త్రీయ పద్ధతుల్లో.. ప్రపంచంలోనే ఉత్తమ కోచ్‌లతో శిక్షణనిప్పిస్తారు. నిరంతరం వారి ఆటతీరును పర్యవేక్షిస్తూ కావాల్సిన సహాయ సహకారాలన్నీ అందిస్తారు.
ఏయే క్రీడాంశాల్లో..
మిషన్ ఒలింపిక్స్‌లో భాగంగా భారత్‌కు పతకాలు వచ్చే అవకాశం ఉన్న 10 క్రీడాంశాల్ని గుర్తించారు. ఇందులో అథ్లెటిక్స్, డైవింగ్, ఆర్చరీ, వెయిల్‌లిఫ్టింగ్, బాక్సింగ్, రోయింగ్, సెయిలింగ్, రెజ్లింగ్, ఈక్వెస్ట్రియాన్, షూటింగ్ ఉన్నాయి.
ఎక్కడెక్కడ కేంద్రాలున్నాయి..
మిషన్‌లో భాగంగా ఆటగాళ్లకు శిక్షణనిచ్చేందుకు ఆయా ప్రాంతాల్లో పలు క్రీడలకు చెందిన మైదానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, ఇండోర్ స్టేడియాలు అభివృద్ధి చేశారు. పుణెలో దాదాపు 200 మంది ఆటగాళ్లకు ఒలింపిక్ స్థాయి శిక్షణనిచ్చేలా ఓ భారీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నెలకొల్పారు. మేరఠ్‌లో 200 ఎకరాల్లో ఈక్వెస్ట్రియాన్ మైదానం ఉంది. ముంబయిలోని ఆర్మీ యాచింగ్ నోడ్‌లో సెయింగ్లో శిక్షణనిస్తున్నారు. పుణెలో వెయిట్లిఫ్టర్లకు అత్యాధునిక శిక్షణా ఏర్పాట్లు ఉన్నాయి. ఇదే నగరంలో ఉన్న ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, డైవింగ్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, ఫెన్సింగ్‌లో శిక్షణనిస్తున్నారు.
వీళ్లంతా మిషన్ ఒలింపియన్లే..
టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అమిత్ పంగల్(బాక్సింగ్), మనీశ్ కౌశిక్(బాక్సింగ్), సతీశ్ కుమార్(బాక్సింగ్), అవినాశ్ సబ్లే(అథ్లెటిక్స్) కూడా మిషన్ ఒలింపిక్స్‌లో భాగంగా శిక్షణ పొందినవారే. రోయింగ్‌లో తొలిసారి సెమీ ఫైనల్‌కు చేరిన అర్జున్ లాల్, అర్వింద్ సింగ్ కూడా ఆర్మీకి చెందినవారే. వీరితో పాటు గతంలో కామన్వెల్త్, ఆసియా, దక్షిణాసియా సహా ప్రపంచ స్థాయి పోటీల్లో భారత్‌కు పతకాలు తెచ్చిన అనేక మంది మిషన్ ఒలింపిక్స్‌లో శిక్షణ తీసుకున్నారు.
ఓవైపు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే.. మరోవైపు ఒలింపిక్స్ వంటి విశ్వక్రీడల్లో పతకాలతో భారత పతాకాన్ని ఎగురవేసేందుకు సైన్యం కృషి చేస్తోంది. చిన్న వయసులోనే సత్తా ఉన్న ఆటగాళ్లను గుర్తించి వారిని ఆర్మీలోకి తీసుకుంటోంది. జూనియర్, సబ్-జూనియర్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని ప్రోత్సహించేలా హవల్దార్ స్థాయి ఉద్యోగాన్ని కట్టబెడుతోంది. పతకాల వేటలో భారత్ చేస్తున్న కృషికి దన్నుగా నిలుస్తోంది.