Congress: నాడు వాజ్‌పేయీ అడిగారనే నెహ్రూజీ చర్చ.. మోదీజీ నేడు మీ మౌనమేల..?

భారత్‌-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్‌లో చర్చ చేపట్టడం లేదని కాంగ్రెస్‌(Congress) ఆరోపించింది. ఈ అంశంపై మోదీ (Modi) మౌనంగా ఎందుకు ఉంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసింది.

Published : 15 Dec 2022 14:26 IST

దిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని తవాంగ్‌ సెక్టార్‌ (Tawang sector)లో వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనికుల చొరబాటు యత్నం ఘటనపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చకు అంగీకరించకపోవడాన్ని కాంగ్రెస్‌ (Congress) పార్టీ మరోసారి దుయ్యబట్టింది. చైనా (China) తీరుపై మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీసింది. ఈ సందర్భంగా 1962 నాటి యుద్ధం సమయంలో అప్పటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. మోదీ సర్కారును ఎద్దేవా చేసింది. నాడు వాజ్‌పేయీ డిమాండ్‌ చేయడంతో నెహ్రూజీ చర్చ చేపట్టారని ఏఐసీసీ మీడియా హెడ్‌ పవన్‌ ఖేడా గుర్తు చేశారు.

అప్పుడు కాంగ్రెస్‌ ఎంపీలూ ప్రశ్నించారు..

‘‘1962లో భారత్‌-చైనా (India-China war) యుద్ధం జరిగినప్పుడు పార్లమెంట్‌లో దానిపై చర్చ చేపట్టాలని అటల్‌ బిహరీ వాజ్‌పేయీ డిమాండ్‌ చేశారు. అందుకు నెహ్రూజీ (అప్పటి ప్రధాని) అంగీకరించారు. ఆ చర్చను రహస్యంగా ఉంచాలని ఓ ఎంపీ అప్పట్లో సూచించారు. కానీ, నెహ్రూజీ అందుకు సమ్మతించలేదు. అంతెందుకు.. ఆ చర్చలో కాంగ్రెస్‌ ఎంపీలు కూడా సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చరిత్ర నుంచి ప్రధాని మోదీ నేర్చుకోవాలి’’ అని పవన్‌ ఖేడా హితవు పలికారు.

‘‘చైనాతో మీకున్న అనుబంధం ఏంటీ? సరిహద్దు వివాదాలపై మాట్లాడకుండా మౌనంగా ఉండేలా మిమ్మల్ని బలవంతపెడుతున్న పరిస్థితులేంటీ? ఈ ప్రశ్నలకు యావత్ దేశం సమాధానాలు తెలుసుకోవాలనుకుంటోంది’’ అని పవన్‌ ఖేడా ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘చైనా అంశంపై ప్రతిపక్షాలు, మీడియా ఏం పట్టనట్లుగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది. దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరపకుండా దూరంగా పారిపోతోంది. దీనిపై ప్రధాని మోదీ (Modi) ఏం మాట్లాడట్లేదు. ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా చైనాకు ఆయన క్లీన్‌చిట్‌ ఇస్తారు’’ అని పవన్‌ ఖేడా మీడియా సమావేశంలో అన్నారు. గతంలో మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చైనా కంపెనీలకు ఆ రాష్ట్రంలో భూములు కేటాయించారని ఆయన ఆరోపించారు. ‘పీఎం కేర్స్‌’ ఫండ్స్‌కు చైనా కంపెనీలు విరాళాలిస్తున్నాయని దుయ్యబట్టారు. దీని వెనుక మర్మమేంటో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ (LAC) వద్ద ఈ నెల 9వ తేదీన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా సైన్యం ప్రయత్నించింది. భారత సైన్యం వారిని తిప్పికొట్టడంతో డ్రాగన్ బలగాలు తిరిగి తమ స్థానాల్లోకి వెళ్లిపోయాయని ఇటీవల కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. అయితే, దీనిపై చర్చ జరపాలని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని