ఏమిటీ డెల్టా ప్లస్‌ వేరియంట్‌? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

కొవిడ్‌-19లో రోజుకో కొత్త వేరియంట్‌ పుట్టుకొస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్‌లో సంభవించిన సెకండ్‌ వేవ్‌ భారీ స్థాయిలో నష్టం కలిగించింది. దీనికి కారణం డెల్ట.....

Updated : 21 Jun 2021 19:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌-19లో రోజుకో కొత్త వేరియంట్‌ పుట్టుకొస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్‌లో సంభవించిన సెకండ్‌ వేవ్‌ భారీ స్థాయిలో నష్టం కలిగించింది. దీనికి కారణం డెల్టా వేరియంట్‌. చైనా స్ట్రెయిన్‌తో పోలిస్తే దీని వ్యాప్తి వేగం ఎక్కువగా ఉండడంతో దాదాపు 40 నుంచి 50 శాతం కేసులు ఈ వేరియంట్‌ మూలంగానే వచ్చాయి. ఇప్పుడు పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చాయన్న సమయంలో కొత్తగా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ (B.1.617.2.1) వెలుగుచూసింది. ప్రస్తుతానికి దీనిపట్ల ఆందోళన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నా.. అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

డెల్టా వేరియంట్‌లో సంభవించిన మ్యుటేషన్‌ కారణంగా కొత్తగా పుట్టుకొచ్చిందే ఈ డెల్టా ప్లస్‌ వేరియంట్‌. దేశంలో తొలిసారి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఈ నెల 16న ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతానికి అంత ఆందోళనకరం కాదని వెల్లడించింది. గ్లోబల్‌ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ ఆల్ ఇన్‌ప్లూయాంజా డేటా (జీఐఎస్ఏఐడీ) ప్రకారం జూన్‌ 17 నాటికి ప్రపంచవ్యాప్తంగా 63 కేసులు ఉన్నాయి. ఇందులో ఆరు కేసులు భారత్‌ నుంచి నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వేరియంట్‌ ఉనికిని, పెరుగుదలను ఎప్పటికప్పుడు కొవిడ్ వేరియంట్లను పర్యవేక్షించడానికి ఉద్దేశించిన INSACOG ద్వారా పరిశీలిస్తున్నట్లు కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వీకే పాల్‌ చెప్పారు. ఇప్పటి వరకు దీని తీవ్రత ఏంటో తెలీదని, ప్రస్తుతానికైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వైరస్‌లు అనేవి ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతుంటాయని, అయితే, మరో ఉప్పెన రాకుండా తాము అప్రమత్తంగా ఉంటున్నామని సీసీఎంబీ సలహాదారు రాకేశ్‌ మిశ్రా పేర్కొన్నారు.

ప్రస్తుతానికి కొవిడ్‌ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఉద్దేశించి కాసిరివిమాబ్‌, ఇమ్డెవిమాబ్‌ అనే యాంటీబాడీలను కలిపి తయారు చేసిన కాక్‌టెయిల్‌ ఔషధాన్ని ఈ రెండు వేరియంట్లు ఏమారుస్తుండడం ఆందోళనకరమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన ఈ రెండు ప్రతినిరోధకాలను మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ అంటారు. దేశంలో ప్రస్తుతం కొవిడ్‌ చికిత్సలో అత్యవసర వినియోగానికి ఈ ఔషధానికి అనుమతి పొంది ఉంది. అలాగే, ఈ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ఎక్కడ రూపాంతరం చెందిందనే దానిపైనా ఇంకా స్పష్టత రాలేదు. తొలిసారి యూరప్‌లో ఈ ఏడాది మార్చిలో గుర్తించారు. నేపాల్‌, టర్కీ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి సేకరించిన శాంపిళ్లను పరీక్షించినప్పుడు ఈ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ గుర్తించినట్లు ఇంగ్లాండ్‌ ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. దీన్ని డబ్ల్యూహెచ్‌వో నేపాల్‌ విభాగం తోసిపుచ్చింది. ఏదేమైనా కొత్త వేరియంట్లు పుట్టుకురావడం సహజమని, ప్రజలు అజాగ్రత్తగా ఉంటే మరో విపత్తు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని