Nirmala Sitharaman: ఏ పేదరికం గురించి మాట్లాడాలి..? రాహుల్‌పై నిర్మలమ్మ ఫైర్‌

కేంద్ర బడ్జెట్‌లో పేద ప్రజలను వదిలేశారంటూ కాంగ్రెస్‌ పార్టీ సహా ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గట్టిగా బదులిచ్చారు. ఏడేళ్ల క్రితం

Published : 12 Feb 2022 02:08 IST

దిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో పేద ప్రజలను వదిలేశారంటూ కాంగ్రెస్‌ పార్టీ సహా ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గట్టిగా బదులిచ్చారు. ఏడేళ్ల క్రితం 2013లో ‘పేదరికం’పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శలపై ధ్వజమెత్తారు. ‘‘పేదరికం అనేది కేవలం మానసిక స్థితి అన్నారు కదా.. దాని గురించి మాట్లాడాలా..?’’ అని రాహుల్‌ను ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. 

కేంద్ర బడ్జెట్‌ 2022-23పై రాజ్యసభలో జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ నేడు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా బడ్జెట్‌లో పేదలకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై స్పందించిన ఆమె.. ‘‘మానసిక పేదరికం గురించి మాట్లాడాలా? కాస్త స్పష్టంగా చెప్పండి’’ అని అన్నారు. దీనికి శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి పేదలను ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. అయితే దీనిపై నిర్మలమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘నేను పేదలను ఎగతాళి చేయడం లేదు. పేదలను అపహాస్యం చేసిన వారితోనే మీ పార్టీ పొత్తు పెట్టుకుంది. మీ(కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశిస్తూ) మాజీ అధ్యక్షుడు గతంలో పేదరికానికి కొత్త అర్థం చెప్పారు. ‘పేదరికం అంటే.. దుస్తులు, తిండి, డబ్బు లేకపోవడం కాదు. అది కేవలం మానసిక స్థితి మాత్రమే. ఆత్మ విశ్వాసంతో దాన్ని అధిగమించొచ్చు’ అని ఆయన అన్నారు. ఆ పేదరికం గురించే మాట్లాడమంటారా?’’ అంటూ ఆర్థిక మంత్రి ఎద్దేవా చేశారు.

ఇక బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్ నేత కపిల్‌ సిబల్‌.. ‘‘2014 నుంచి భారత్‌ రాహు కాలంలో ఉంది’’ అని చేసిన వ్యాఖ్యలకు కూడా నిర్మలమ్మ దీటుగానే బదులిచ్చారు. ‘‘2013లో మీ(కాంగ్రెస్‌) సొంత ప్రధాని తెచ్చిన ఆర్డినెన్స్‌ను మీడియా ముందు చించేసిన రోజు రాహు కాలం ఉంది’’ అని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని