What is VPN: వీపీఎన్‌ ముసుగు కప్పి... నిఘా నేత్రం కళ్లుగప్పి

వీపీఎన్‌ (VPN) సేవలను బ్యాన్‌ చేయాలని హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. అసలేంటీ వీపీఎన్‌. 

Updated : 03 Sep 2021 14:06 IST

వీపీఎన్‌పై నిషేధానికి పార్లమెంటరీ కమిటీ సిఫార్సు

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

ఇటీవల కాలంలో టెకీల నోట తరచూ వినిపిస్తున్న పదం వీపీఎన్‌ (VPN). ఇప్పుడు భారత్‌లో అది బ్యాన్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై త్వరలో ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానుంది. వీపీఎన్‌ సేవలను బ్యాన్‌ చేయాలని హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో వీపీఎన్‌ వినియోగం వల్ల వస్తున్న పలు సాంకేతిక సవాళ్లనూ కమిటీ ప్రస్తావించింది. దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చని నివేదికలో పేర్కొంది. వీపీఎన్‌ సేవలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారి గుర్తింపును దాచడానికి ఉపయోగపడుతున్నాయని తెలిపింది.

ఏమిటీ వీపీఎన్‌..

వీపీఎన్‌ అంటే వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ అని అర్థం. ఇది వినియోగదారుడికి పబ్లిక్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌లో ప్రైవేటు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది పూర్తిగా ఎన్‌క్ర్రిప్టెడ్‌ విధానంలో ఉండటంతో ఆ సమాచారాన్ని ఇతరులు తెలుసుకొనే అవకాశం లేదు. అలా వీపీఎన్‌ వినియోగదారుడి ప్రైవసీని కల్పిస్తుంది. సులభంగా చెప్పాలంటే... మీరు మీ ఇంట్లోనే ఉండి ఇంటర్నెట్‌ను వాడుతూ... ఏ ఆస్ట్రేలియాలో ఉన్నట్లు మీ నెట్‌వర్క్‌ను భ్రమింపజేయొచ్చు. తద్వారా మీరు ఎక్కడి నుంచి ఇంటర్నెట్‌ వాడుతున్నారు, ఏం బ్రౌజ్‌ చేస్తున్నారనేది ఎవరికీ తెలియకుండా చేయొచ్చు. దీని కోసం చాలా రకాల సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.

వీపీఎన్‌ ఎలా పనిచేస్తుంది..?

పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌లో ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ (ఐపీ) అడ్రస్‌ని రహస్యంగా ఉంచడం ద్వారా వీపీఎన్‌ పని చేస్తుంది. లోకల్‌ వైఫైల నుంచి డేటా మార్పిడి సమయంలో అది ఎన్‌క్రిప్ట్‌ అయి ఉంటుంది. దీంతో డేటా ఎక్కడి నుంచి వచ్చిందనే... లొకేషన్‌ చెప్పడం కష్టం. 

దేని కోసం వాడతారు..?

వీపీఎన్‌ వినియోగదారుడు ఆన్‌లైన్‌లో ఉన్న విషయం గోప్యంగా ఉంచుతుంది. ఆన్‌లైన్‌లో బదిలీ చేసే డేటా ఎన్‌క్రిప్ట్‌ కావడం ఇందులో అతిపెద్ద ప్రయోజనం. ఇంటర్నెట్‌లో పొంచి ఉన్న హ్యాకర్లను, ముప్పును తప్పించుకొనే అవకాశమూ ఉంది. పబ్లిక్‌ వైఫైల్లో కూడా మీ ప్రైవసీ దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకొనే వీలుంది.  

*  సాధారణంగా ఓ వినియోగదారుడు ఆన్‌లైన్‌లో బ్రౌజ్‌ చేసిన అంశాలను ఇంటర్నెట్‌ ప్రొవైడర్‌ ఎప్పటికప్పుడు భద్రపరుస్తారు. మన ఐపీ అడ్రస్‌ను ట్రాక్‌ చేస్తుంటారు. కానీ, వీపీఎన్‌ వినియోగిస్తుంటే ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌కు ఆన్‌లైన్‌ సెర్చ్‌ కార్యకలాపాలు, హిస్టరీ కనిపించవు. దాంతో ప్రైవసీ వస్తుంది. కానీ అసాంఘిక కార్యకలాపాలు చేస్తే తెలియదు. 

* వీపీఎన్‌ మన సిస్టమ్‌కు ఒక నకిలీ ఐపీ అడ్రస్‌ను సృష్టిస్తే.. దాని ఆధారంగా మనం ఇంకో ప్రాంతంలో ఉన్నట్లు ఇంటర్నెట్‌లో కనిపిస్తుంది. మనం ఉన్న ప్రాంతంలో నిషేధించిన ఇంటర్నెట్‌ సేవలను కూడా ఆ ఐపీ అడ్రస్‌ను వినియోగించి వాడుకోవచ్చు. ఉదాహరణకు చైనాలో గూగుల్‌ను బ్యాన్‌ చేశారు. కానీ, వీపీఎన్‌ వాడి అక్కడ కూడా గూగుల్‌ సేవలను వాడుకోవచ్చు. 

*  ప్రైవసీ కారణంతో వర్క్‌ఫ్రం హోం, రిమోట్‌ వర్కింగ్‌ చేసే ఉద్యోగులకు కార్పొరేట్‌ సంస్థలు వీపీఎన్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. వారి కార్యకలాపాలను మరొకరు గమనించకుండా జాగ్రత్తపడుతున్నాయి. దీంతో కంపెనీలకు సంబంధించిన కీలక డేటా సురక్షితంగా ఉంటుంది. కరోనా సమయంలో దేశంలో వీపీఎన్‌ వినియోగం గణనీయంగా పెరిగడం గమనార్హం.

సమస్యలు ఏమిటీ..?

వీపీఎన్‌తో ఇంటర్నెట్‌ వినియోగదారులు వ్యక్తిగత అంశాలు గోప్యంగా ఉన్నాయి. కానీ, ఇది సైబర్‌ క్రిమినల్స్‌ వినియోగిస్తే... అగంతుకుల కదలికలను గుర్తించలేం. అందుకే కీలక సందర్భాల్లో దర్యాప్తు సంస్థలకు.. వారి కచ్చితమైన ఐపీ అడ్రస్‌లు గుర్తించడం సమస్యగా మారుతోంది. దీంతో అధికారులు అత్యాధునిక నిఘా పద్ధతులను అనుసరించాల్సి వస్తోంది. పార్లమెంటరీ కమిటీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ అందోళన వ్యక్తం చేసింది. దీని ద్వారా ఆన్‌లైన్‌లో అసాంఘిక కార్యకలాపాలను గుర్తించలేమని పేర్కొంది.  

ఆన్‌లైన్‌ పైరసీ కార్యకలాపాలకు ఎక్కువగా దీనిని వాడుతున్నారు. డార్క్‌ వెబ్‌లో కార్యకలాపాలు కూడా వీపీఎన్‌ మార్గంలోనే జరుగుతున్నాయి. అక్కడ ఆయుధాలు, మాదకద్రవ్యాలు, ఇతర అవాంఛిత సేవలు అందుబాటులో ఉంటాయన్న విషయం తెలిసిందే. 

చైనాలో వీపీఎన్‌ సేవలు కష్టమే..

చైనా కొన్నేళ్లుగా వీపీఎన్‌ సేవలను కట్టడి చేస్తూ వస్తోంది. ఆ దేశంలోని గ్రేట్‌ ఫైర్‌వాల్‌ ఇంటర్నెట్‌ సెన్సార్‌షిప్‌ను పలుమార్లు అప్‌డేట్‌ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి సమయంలో దేశం నుంచి వీపీఎన్‌ మార్గంలో సమాచారం లీకవుతోందని అనుమానించి ఈ చర్యలు తీసుకొంది. 

కమిటీ సూచనలు ఏమిటీ..

హోం శాఖ, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ, ఇంటర్నెట్‌ ప్రొవైడర్లతో కలిసి పనిచేయాలని పేర్కొంది. దీంతోపాటు వీపీఎన్‌ బ్యాన్‌ విషయంలో అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని చెప్పింది. ఇందుకు అవసరమైన వ్యస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. 

ఇంటర్నెట్‌ స్వేచ్ఛకు భంగమేనా..

వీపీఎన్‌పై నిషేధాన్ని వ్యతిరేకించే వారూ ఉన్నారు. నెట్‌ న్యూట్రాలిటీ, వ్యక్తిగత గోప్యతకు ఈ నిషేధం గండి కొడుతుందని ఇంటర్నెట్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ పాలసీ కౌన్సిల్‌కు చెందిన రోహిణ్‌ గార్గ్‌ అంటున్నారు. భారత ఇంటర్నెట్‌ వ్యవస్థలో వీపీఎన్‌ విడదీయలేని భాగమని పేర్కొన్నారు.గంపగుత్తగా వీపీఎన్‌పై నిషేధం తగదన్నారు.

బ్యాన్‌ ప్రయోజనం ఉంటుందా..?

చైనాలో ఇప్పటికే వీపీఎన్‌ను బ్యాన్‌ చేశారు. కానీ, అక్కడ అక్కడ ఆ నిషేధం సమర్థంగా అమలు కావడంలేదు. అందుకే ఇప్పటికీ ప్రపంచంలోని టాప్‌ 10 వీపీఎన్‌ వినియోగ మార్కెట్లలో చైనా స్థానం దక్కించుకొంది. ఆన్‌లైన్‌లో నిషేధిత కంటెంట్‌ను చూడకుండా, వినియోగించకుండా చేయడానికి వీపీఎన్‌పై నిషేధం ఒక్కటే మార్గం కాదు. సాంకేతికత రెండు వైపుల పదున్న కత్తిలాంటింది. ముఖకవళికల గుర్తింపు టెక్నాలజీతో క్రిమినల్స్‌, తప్పిపోయిన వారిని కనుగొనొచ్చు. అదే సమయంలో ప్రభుత్వాలు తమ ప్రత్యర్థులపై నిఘా కూడా పెట్టవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు