Vaccine for children: చిన్నారులకు కరోనా టీకా.. ఇప్పుడే అవసరం లేదట..!

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో చిన్నారులు, పిల్లలకు వ్యాక్సిన్‌ ఇచ్చే అంశంపై ప్రభుత్వంలో విస్తృతంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి

Published : 21 Dec 2021 14:35 IST

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో చిన్నారులు, పిల్లలకు వ్యాక్సిన్‌ ఇచ్చే అంశంపై ప్రభుత్వంలో విస్తృతంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఇప్పుడే టీకాలు ఇవ్వడం అంత అత్యవసరమేమీ కాదని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యునైజేషన్‌(ఎన్‌టీఏజీఐ) సభ్యుడొకరు తాజాగా ఓ జాతీయ మీడియాతో అన్నారు. ఇదే విషయాన్ని కేంద్రానికి కూడా చెప్పినట్లు పేర్కొన్నారు. 

‘‘భారత్‌లో 12ఏళ్ల లోపు చిన్నారుల్లో కొవిడ్ మరణాలు నమోదు కాలేదు. ఈ వయసు వారిలో కొందరికి కరోనా సోకినప్పటికీ ఆ తీవ్రత తక్కువగానే ఉంది. ఈ డేటాను విశ్లేషించిన తర్వాత చిన్నారులకు ఇప్పుడే కరోనా టీకాలు ఇవ్వడం అత్యవసరం కాదని అనిపిస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పాం’’ అని ఎన్‌టీఏజీఐ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దీనిపై తమ ప్యానెల్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 

చిన్నారులకు టీకా పంపిణీపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ విషయంలో తాము తొందరపడకూడదని నిర్ణయించుకున్నట్లు ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ అన్నారు. నిపుణుల సూచన మేరకే ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు.  ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో చిన్నారులకు టీకా వేస్తున్నప్పటికీ.. భారీ స్థాయిలో మాత్రం ఎక్కడా జరగడం లేదని కేంద్రమంత్రి అన్నారు. 

మరోవైపు స్వదేశీ సంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌ డి టీకాను 12ఏళ్ల పైబడిన వారికి ఇచ్చేందుకు కేంద్రం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీని పంపిణీపై కేంద్రం ఇంకా ప్రకటన చేయలేదు. ఈ టీకాలను తొలుత 7 రాష్ట్రాల్లో అందించేందుకు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని